Telugu Gateway
Andhra Pradesh

అంతర్వేదిలో హిందూ సంస్థల ఆందోళన..ఉద్రిక్తత

అంతర్వేదిలో  హిందూ సంస్థల ఆందోళన..ఉద్రిక్తత
X

అంతర్వేది ఆలయ రథం దగ్దం వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. ఈ అంశంపై హిందూ సంఘాలు మంగళవారం నాడు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయంలోకి దూసుకొచ్చేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు. విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హైందవ శక్తి, భజరంగదల్, హిందూ చైతన్య వేదిక, ధర్మ వీర్ ఆధ్యాత్మిక వేదిక తదితర సంఘాల కార్యకర్తలు ఉన్నారు. అగ్నికి ఆహుతైన స్వామి వారి రథాన్ని పరిశీలించేందుకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు ఉన్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు ఆలయం లోనికి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆలయం హైటెన్షన్ నెలకొంది. అంతకు ముందు ఆలయం వద్దకు ర్యాలీగా బయలు దేరిన హిందూ సంఘాలను పాశర్లపూడి బ్రిడ్జీపై పోలీసులు అడ్డుకున్నారు.

ర్యాలీకి అనుమతులు లేవని తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో హిందూ సంఘాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జైశ్రీరామ్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్నిప్రమాదంలో అంతర్వేది ఆలయ రథం కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఆలయాన్ని సందర్శించిన మంత్రులు మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. జరిగిన ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే కళ్యాణోత్సవాల నాటికి కొత్త రథం సిద్ధం చేయించుతామని మంత్రులు తెలిపారు. అంతర్వేదిలో జరిగిన ఘటనలో రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా ఆలయాల వద్ద భద్రత పెంచుతామని తెలిపారు.

Next Story
Share it