Telugu Gateway
Andhra Pradesh

రిలయన్స్ చేతికి ఫ్యూచర్ రిటైల్...చంద్రబాబు కంపెనీ బయటకు!

రిలయన్స్ చేతికి ఫ్యూచర్ రిటైల్...చంద్రబాబు కంపెనీ బయటకు!
X

హెరిటేజ్ వాటాలు కూడా అంబానీ కంపెనీకేనా?!

దేశీయ మార్కెట్లో రిలయన్స్ హవా నడుస్తోంది. ఓ వైపు జియో ఫ్లాట్ ఫామ్స్ లో వాటాల విక్రయాల ద్వారా లక్ష కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఆకర్షించిన రిలయన్స్ ఇప్పుడు రిటైల్ వ్యాపారంలో అదే దూకుడు చూపిస్తోంది. తాజాగా రిలయన్స్ రిటైల్ విభాగం ఫ్యూచర్ గ్రూపునకు చెందిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ను 24713 కోట్ల రూపాయలతో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. గతంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లో భాగంగా ఉన్న హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ షాప్ లను ఫ్యూచర్ గ్రూపు కొనుగోలు చేసింది. అందులో భాగంగా ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ లో హెరిటేజ్ ఫుడ్స్ కు వాటాలు దక్కాయి. ఇప్పుడు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కంపెనీనే రిలయన్స్ చేతికి వెళుతోంది. దీంతో హెరిటేజ్ ఫ్రెష్ అమ్మకంలో భాగంగా వచ్చిన 1,78,47,420 ఫ్యూచర్ రిటైల్ షేర్లను పూర్తిగా లేదా పాక్షికంగా అమ్మేందుకు వీలుగా శుక్రవారం నాడు జరిగిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ గ్రూపునకే చెందిన ప్రాక్సిస్ హోమెర్ రిటైల్ లిమిటెడ్ కు చెందిన 8,92,371 షేర్లను కూడా విక్రయించటానికి నిర్ణయం తీసుకున్నారు.

ఈ రెండు కంపెనీల షేర్లను ఒకటి లేదా రెండు దశల్లో విక్రయించటానికి వీలుగా మర్చంట్ బ్యాంకర్ ను నియమించుకున్నారు. ఈ షేర్ల అమ్మకానికి సంబంధించిన అవసరమైన చర్యలు తీసుకునే అధికారాలను బోర్డు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ నారా భువనేశ్వరికి అప్పగించారు. అయితే హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన వాటాలను కూడా రిలయన్స్ రిటైల్ విభాగమే దక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. బల్క్ డీల్ రూపంలో ఈ లావాదేవీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే హెరిటేజ్ చేతిలో ఉన్న వాటాను రిలయన్స్ రిటైల్ విభాగం దక్కించుకుంటుందా ? లేక వేరే వాళ్ల చేతికి వెళుతుందా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it