Telugu Gateway
Politics

ఎన్డీయేకు షాక్...కేంద్ర మంత్రి రాజీనామా

ఎన్డీయేకు షాక్...కేంద్ర మంత్రి రాజీనామా
X

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఊహించని పరిణామం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తీవ్రంగా విభేధించింది. ఇవి దేశంలోని రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే తాము ఎన్డీయే ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నామని..అకాళీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. ఈ బిల్లులో లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రిగా ఉన్న హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నట్లు ఆమె తెలిపారు.

రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అకాలీదళ్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. వ్యవసాయ బిల్లులపై ఎన్డీయేకు తన వైఖరి స్పష్టం చేసిన అకాలీదళ్‌ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతిస్తామని తెలిపింది. హర్‌సిమ్రత్‌ కౌర్‌ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని రాజీనామా సమర్పించారు. వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా ఈ బిల్లులను తీసుకొచ్చామని బీజేపీ పేర్కొంటోంది. ఈ బిల్లులపై పంజాబ్‌, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోంది.

Next Story
Share it