Telugu Gateway
Andhra Pradesh

కేంద్రం చెపితే మీటర్లు పెడుతున్నారు..కేంద్రo సబ్సిడీ తీసేయమంటే?!

కేంద్రం చెపితే మీటర్లు పెడుతున్నారు..కేంద్రo సబ్సిడీ తీసేయమంటే?!
X

భవిష్యత్ లో సీలింగ్ లు తప్పవనే సంకేతాలు

సంస్కరణలు అంటేనే సబ్సిడీలకు కోతలు అంటున్న అధికారులు

‘మీకు అప్పు తీసుకునే పరిమితి పెంచాలంటే అవి చేయాలి..ఇవి చేయాలని కేంద్రం షరతులు పెట్టింది. ఆ షరతులకు తలొగ్గే ఏపీ సర్కారు ఉచిత విద్యుత్ స్థానే నగదు బదిలీ (డీబీటీ) స్కీమ్ ప్రవేశపెట్టానికి రెడీ అయింది. గురువారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. సీఎం జగన్ రైతులకు భరోసా ఇచ్చేందుకు చాలా అంశాలు ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే ‘ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది అందులో ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు ఒకటి.’ అని కూడా చెప్పారు. వాస్తవానికి ఇది సీఎం జగన్ తనంతట తాను తీసుకున్న నిర్ణయం కాదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ మరిన్ని అప్పులు చేసుకోవాలంటే కేంద్రం చెప్పిన వాటికి ఓకే చెప్పేసింది. ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ వల్ల బాధ్యత లేకుండాపోయిందని..నీటి వినియోగం కూడా అనూహ్యంగా పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఉచిత విద్యుత్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉందని గతంలో పలు నివేదికలు తెలిపాయి.

కేంద్రం చెప్పింది అని డీబీటికి ఓకే చేసిన ఏపీ సర్కారు..రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ రాయితీలకు..ఇతర పథకాలకు సంపన్న వర్గాల రైతులకు...లేక ఇన్ని ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డీబీటీ వర్తింపచేయాలని చెపితే అప్పుడు పరిస్థితి ఏంటి?. ఇప్పుడు కేంద్రం మాటకు ఓకే చెప్పిన ఏపీ సర్కారు అప్పుడు నో చెప్పగలదా?. సంస్కరణలు అంటే ఖచ్చితంగా సబ్సిడీల కోతలు వేసే ప్రక్రియ అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్ సర్కారు ఏడాదిన్నరగా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తోంది. కానీ ఏపీ సర్కారు ఇప్పుడు తన నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి రైతులు ఛార్జీలు చెల్లిస్తే అధికారుల్లో మరింత బాధ్యత వస్తుందని..జవాబు దారీ తనం వస్తుందని చెబుతోంది. ఇప్పటివరకూ విద్యుత్ శాఖ జవాబుదారీతనం...బాధ్యతతోనే ఉచిత విద్యుత్ అందించింది కదా?. కొత్తగా రావటానికి ఏముంది?. ఎలా చేయాలి అన్నది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కానీ..రైతులు డబ్బులు చెల్లించారా..లేదా అన్న దాని మీద ఆదారపడి ఉంటుందా?.

Next Story
Share it