Telugu Gateway
Andhra Pradesh

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్..అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్..అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!
X

పెట్టుబడులకు..ర్యాంకులకు సంబంధం ఉండదన్న బుగ్గన

అధికారంలో ఉంటే ఓ మాట. ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. వైసీపీదీ కూడా అదే బాట. తాజాగా ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంక్ వచ్చింది. దీనిపై ఏపీ పరిశ్రమల శాఖ మేకపాటి గౌతంరెడ్డితోపాటు ఇతర మంత్రులు సీఎం జగన్ కృషి..నిర్ణయాల వల్లే ఇది సాధ్యం అయిందని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమన్నదో తెలుసా?. ప్రస్తుత ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి 2018 జులైలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఫస్ట్ వచ్చిన 2017 సంవత్సరానికి 71500 కోట్లు భారత దేశానికి వాస్తవానికి పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4500 కోట్లు మాత్రమే వచ్చింది. అదే సంవత్సరంలో మహారాష్ట్ర కు ఈ జాబితాలో పదవ స్థానం కూడా లేదు. ఆ తర్వాతే ఉంది. కానీ మహారాష్ట్రకు 40500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 40 శాతం మహారాష్ట్రకు వచ్చింది. మీకు 4500 కోట్లు వచ్చింది.

కానీ మీరు మాత్రం మేం ఫస్ట్ అని చెప్పుకుంటారు. బెల్ట్ వేసుకున్నందుకు..టై కట్టుకున్నందుకు...సూట్ వేసుకున్నందుకు. హర్యానాకు ఎంత వచ్చింది ఆ రోజు. జాబితాలో హర్యానా కూడా మూడవ స్థానంలో ఉంది. కానీ హర్యానాకు పెట్టుబడే రాలేదు. మీరు చెబుతున్న సులభ వాణిజ్యపద్దతిలో కర్ణాటక 8వ స్థానం వచ్చినా కూడా 2018లో లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులకు దీనికి సంబంధం లేదని క్లియర్ గా చెబుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కూడా బుగ్గన ఈ అంశంపై మాట్లాడారు. ఎంత వేగంగా అనుమతులు ఇస్తారు వంటి ప్రశ్నలకు ఎస్ ఎస్ అని చెపితే ర్యాంకులు ఇస్తారని..ఇదేమీ పెద్ద విషయంకాదని వ్యాఖ్యానించారు గతంలో.

కానీ ఇప్పుడు ఇదే వైసీపీ సర్కారు తమ వల్లే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని..దీనికి కోసం తాము చాలా చేశామని చెప్పుకుంటోంది. విచిత్రంగా ప్రతిపక్ష టీడీపీ కూడా తమ హయాంలో చేసిన నిర్ణయాల వల్లే ఈ ర్యాంకు వచ్చిందని ఈ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రచారం చేసుకుంటోంది. వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉండగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిందే నిజం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు..పెట్టుబడుల రాకకు సంబంధం ఉండదు. విచిత్రం ఏమిటంటే వైసీపీ కూడ అధికారంలోకి వచ్చాక అప్పటి చంద్రబాబు మోడల్ నే ఫాలో అవటం.

ప్రతిపక్షంలో ఉండగా బుగ్గన మాటల వీడియో

https://www.youtube.com/watch?v=Mdn0oogJtRw

Next Story
Share it