Telugu Gateway
Latest News

కెసీఆర్ యాదాద్రి పర్యటనలో ఆసక్తికర ఘటన

కెసీఆర్ యాదాద్రి పర్యటనలో ఆసక్తికర ఘటన
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం నాడు యాదాద్రిని సందదర్శించారు. తొలుత గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి ఆదునికీకరణ పనులను పరిశీలించారు. కెసీఆర్ యాదాద్రి పర్యటన సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యాదాద్రిలో కోతుల సంచారం ఎక్కువగా ఉంటుంది. కెసీఆర్ పర్యటన యాదాద్రి పర్యటన ముగించుకుని వెనక్కి వస్తున్న సమయంలో కోతులు పెద్ద ఎత్తున కన్పించటంతో సీఎం కెసీఆర్ కాన్వాయ్ దిగి..కారులో ఉన్న అరటి కాయలను కోతులకు అందజేశారు. అంతకు ముందు ఆయన ఆరు గంటలపాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు వంటి సకల సౌకర్యాలతో రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిపేట చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆదేశాలు ఇచ్చారు.

ఆలయ పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్‌ లను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం కోరారు. యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. కళ్యాణ కట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి సూచించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుండి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్‌లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అని, ఒకేసారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

Next Story
Share it