శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. తొలుత ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా తిరుమల చేరుకున్నారు. బుధవారం రాత్రి జగన్ శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందర కాండ పారాయణ కార్య క్రమంలో పాల్గొంటారు. కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.