Telugu Gateway
Politics

అందరూ నిర్ధోషులైతే..మసీదు ఎలా కూలింది?

అందరూ నిర్ధోషులైతే..మసీదు ఎలా కూలింది?
X

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి లక్నో సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై అప్పీల్ చేయాలని ఆయన సీబీఐను కోరారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చారు అని అసదుద్దీన్ ప్రశ్నించారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని వ్యాఖ్యానించారు. మసీదును ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఉమా భారతి మసీదును కూల్చండి అని నినాదాలు చేశారని గుర్తుచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. చరిత్రలో ఈ రోజు నిజంగా బ్లాక్‌ డే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదు.

‌ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టేయడం సరైన నిర్ణయమా? ఈ తీర్పుపై యావత్‌ ముస్లిం లోకం, పర్సనల్‌ లా బోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుందన్నారు. ‘ఈ వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు గతంలోనే ‘చట్ట నియమాలను అతిగా ఉల్లంఘించడం.. బహిరంగ స్థలంలోని ప్రార్థనా స్థలాన్ని నాశనం చేసిన చర్య’గా వర్ణించింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక విషయాలు దాచిపెట్టింది. ఇందులో ఎలాంటి కుట్ర లేదని తీర్పు వెల్లడించింది. దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి.. చరిత్రలోని ఒక చర్యను అనర్హమైనదానిగా ప్రకటించడానికి ఇన్ని రోజుల సన్నాహాలు అవసరమా. నాకు సమాధానం చెప్పండి’ అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it