Telugu Gateway
Andhra Pradesh

‘బెంజ్’ మంత్రి బుక్ అయినట్లే!

‘బెంజ్’ మంత్రి బుక్ అయినట్లే!
X

మరిన్ని ఆధారాలు బయటపెట్టిన అయ్యన్న

ఏపీకి చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ‘బెంజ్ కారు’తో బుక్ అయినట్లే కన్పిస్తోంది. అయ్యన్న ఆరోపణలపై మంత్రి జయరాం ఇచ్చిన వివరణకు..వాస్తవాలకు మధ్య చాలా తేడా ఉంది.. మా అబ్బాయికి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు..ఫ్రెండ్ కారు కొనుక్కొని తన కొడుకు దగ్గర నుంచి కీస్ తీసుకున్నాడు..ఇది కూడా తప్పేనా? అని మంత్రి ప్రశ్నంచిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మరిన్ని ఆధారాలతో మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆ బెంజ్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉన్న ఫోటోతోపాటు..అందులో మంత్రి తనయుడు, స్వయంగా మంత్రి కూడా తిరిగిన వీడియోలను మీడియాకు చూపించారు. దీంతో వ్యవహారం మరింత సీరియస్ గా మారినట్లు కన్పిస్తోంది. ఇన్ని ఆధారాలు చూపించినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మంత్రిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఇంకా ఆధారాలు ఉన్నాయని..వాటిని కూడా త్వరలోనే బయటపెడతానని ప్రకటించారు అయ్యన్నపాత్రుడు.

ఆయన శనివారం నాడు విశాఖపట్నంలోమీడియా సమావేశం నిర్వహించారు. ‘మంత్రి జయరాం అవినీతిపై ఫిర్యాదు చేస్తే సరైనా స్పందన లేదు. ఫోన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు మెసేజ్ కూడా రాలేదు. అవినీతిపై సీఎం జగన్ ఇచ్చిన స్పీచ్‌కు ఫిర్యాదుకు ఏమైనా సంబంధం ఉందా? ఓ మాజీ మంత్రే ఫిర్యాదు చేస్తేనే దిక్కులేదు. అలాంటిది సామాన్యుడి ఫిర్యాదు చేస్తే దిక్కుమొక్కు ఉంటుందా? తక్షణమే మంత్రి అవినీతిపై ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలి. అచ్చెన్నాయుడిపై ఏ ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు మంత్రి జయరాంపై పక్కా ఆధారాలు చూపించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు ఏ మంత్రిపైనా అవినీతి ఆరోపణలు చేయలేదు. ఆధారాలు లేవు కాబట్టే ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు మంత్రి జయరాం గురించి ఆధారాలు దొరికాయి కాబట్టే అవినీతి గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ కారు మంత్రిది కాకపోతే బెంజ్ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకుంది? కారును ఇప్పటికీ మంత్రి కొడుకే వాడుతున్నాడు. మంత్రి జయరామే స్వయంగా బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? లేదా ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూస్తాం. అలాగే మంత్రి జయరాంకు సంబంధించిన భూకుంభకోణాలపై కూడా త్వరలోనే ఆధారాలు బయటపెడతా. తనను ఏం చేసినా ఫర్వాలేదు. జైల్లో పెట్టినా.. చంపినా భయపడను’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Next Story
Share it