Telugu Gateway
Andhra Pradesh

అప్పుల కోసం కేంద్రం షరతులకు ఏపీ సర్కారు పచ్చజెండా

అప్పుల కోసం కేంద్రం షరతులకు ఏపీ సర్కారు పచ్చజెండా
X

ఉచిత విద్యుత్ అమలుకు నగదు బదిలీ పథకం

రైతులు బిల్లులు చెల్లించాలి..ఆ డబ్బు రైతుల ఖాతాలకు జమ

కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాల అప్పుల పరిమితిని పెంచేందుకు పలు షరతులు పెట్టింది. అందులో ఒకటి ఉచిత విద్యుత్ స్థానే రైతులకు నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ చేయటం. దీంతో పాటు వన్ నేషన్ వన్ కార్డు, పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ పంపిణీలో సంస్కరణలు చేయాలని ప్రతిపాదించింది. ఈ సంస్కరణలు అమలు చేస్తే ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్ బిఎం) పరిమితి పెంచుతామని కేంద్రం ప్రకటించింది. ఒక్కో సంస్కరణకు ఒక్కో రేటింగ్ కు ఇస్తూ ఈ మేరకు ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచటం వల్ల రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో అప్పు చేసుకునే వెసులుబాటు వస్తుంది. సంస్కరణలకు..ఎప్ఆర్ బీఎం పరిమితికి కేంద్రం లింక్ పెట్టింది. అందులో భాగంగానే ఏపీ సర్కారు ఇప్పుడు అత్యంత కీలకమైన ఉచిత విద్యుత్ పథకంలో మార్పులకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఏటా రైతులకు ఏపీ ప్రభుత్వం 12 వేల మిలియన్ యూనిట్ల పైబడి విద్యుత్ సరఫరా చేస్తూ 8400 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. దాదాపు 18 లక్షల వ్యవసాయ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

ఉచిత వ్యవసాయ విద్యుత్ తోపాటు గృహ నిర్మాణ విద్యుత్ రంగానికి 1707 కోట్లు, ఆక్వా రంగానికి మరో 450 కోట్లు, షెడ్యూల్ కులాలు, తెగల వారికి నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కోసం మరో 220 కోట్ల రూపాయల సబ్సిడీగా కేటాయించినట్లు తెలిపారు. వచ్చే 30 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ పథకం నిర్వఘ్నంగా, రైతులకు ఒక్క పైసా భారం పడకుండా అమలు అవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పది వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ లను చేపడుతోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి అదనపు నిధులు మంజూరు చేయటానికి నాలుగు రంగాల్లో సంస్కరణలు తప్పనిసరి చేశారని..వాటిలో విద్యుత్ రంగానికి సంబంధించి వ్యవసాయ విద్యుత్ కొరకు రైతులకు నగదు బదిలీ పథకం ప్రధానమైనదని పేర్కొన్నారు. ఈ పథకం అమలు వల్ల రైతులు జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. నెలవారీ నమోదు అయిన బిల్లు మొత్తం ముందుగానే ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందుకున్న అంతే బిల్లు మొత్తాన్ని రైతు తిరిగి విద్యుత్ కంపెనీకి చెల్లించాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

Next Story
Share it