సిట్-ఏసీబీ-సీబీఐ-టీడీపీపై వైసీపీ ‘ముప్పేటదాడి’

ఓ వైపు సిట్. మరో వైపు ఏసీబీ, ఇంకో వైపు సీబీఐ. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపక్ష టీడీపీపై ముప్పేట దాడికి సమాయత్తం అయింది. ఎలాగైనా రాజధాని భూ కుంభకోణంలో ఆ పార్టీ నేతలను బుక్ చేసేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రివర్గ సబ్ కమిటీ పలు నివేదికలను బహిర్గతం చేసింది. ఆ జాబితా ఆధారంగానే కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏమి అయితే ఆరోపణలు చేసిందో...సాక్షి పత్రికలో పేర్లు...ఎకరాలతో సహా ఏమి అయితే వివరాలు వచ్చాయో అంతకు మించి సంచలనం కలిగించే అంశాలు ఇప్పటివరకూ బయటకు వచ్చిన దాఖలాలు కన్పించటం లేదు. ఈ తరుణంలో అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని ఎక్కడ వస్తుంద అనే సమాచారం ముందే తెలుసుకుని భూములు కొన్నారనే అంశంపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీకి చెందిన పలువురు నేతలు, ప్రముఖులు దాదాపు 4,075 ఎకరాల కొనుగోలు చేశారు.
అందులో 900 ఎకరాల అసైన్డ్ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ భూములు కొన్నవారిలో తెల్లరేషన్‌కార్డు దారులుతో పాటు టీడీపీ నేతలు, వారి సన్నిహితులు, బినామీలు భూములు కొన్నట్టు గుర్తించారు. టీడీపీ నేతలకు వాటాలు ఉన్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశారని తెలిసింది. సెప్టెంబర్ 3,2015న చంద్రబాబు రాజధాని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే జూన్ 1,2014 నుంచి డిసెంబర్ 31,2014 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని.. 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తింపు జరిగినట్లు తేలింది. లాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు తెలుస్తుంది.