సీఎంకు దళితులను దూరం చేసే కుట్రలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. సీం జగన్ పై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన పాలనలో దళితుల భూములు లాక్కున్న చంద్రబాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు దళితులను దూరం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. తమ రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబును ఈ శక్తులు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తమ దోపిడీకి చంద్రబాబు ద్వారా రాచమార్గం వేసుకోవాలని చూస్తున్నారని, పంచ భూతాలను టీడీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. ‘‘గరికపర్రులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఊరు నుంచి దళిత కుటుంబాలను టీడీపీ నేతలు బహిష్కరించారు.
జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను జుట్టు పట్టుకుని కొట్టారు. దళితులు శుభ్రంగా ఉండరని ఆదినారాయణ రెడ్డి హేళన చేశారని సుధాకర్ బాబు గుర్తు చేశారు. దళితులు గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని, టీడీపీలో కొనసాగే దళిత నేతలు సిగ్గు వదిలేసుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న దళిత నేతలకు ధైర్యం ఉంటే చంద్రబాబును నిలదీయాలని కోరారు. 54 వేల మంది బడుగు బలహీన వర్గాలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఎందుకు చంద్రబాబు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.