మూడు రాజధానులపై ఆగస్టు 27 వరకూ స్టేటస్ కో

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల వ్యవహారానికి మరోసారి బ్రేక్ పడింది. ఈ అంశంపై స్టేటస్ కోను ఆగస్టు 27 వరకూ పొడిగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దుకు సంబంధించిన అంశాలపై శుక్రవారం నాడు కోర్టులో విచారణ సాగింది. వాస్తవానికి అంతకు ముందు హైకోర్టు ఆగస్టు 14 స్టేటస్ కో ప్రకటించింది.తాజాగా జరిగిన వాదనల్లో ఈ కేసు వాయిదా వేయండి కానీ..స్టేటస్ కోను పొడిగించవద్దని ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన లాయర్ రాకేష్ త్రివేది కోర్టును కోరారు. అయితే ఈ కరోనా సమయంలో అంత అత్యవసరరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి తన విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
అయినా సరే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 27 వరకూ స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటీషన్ దాఖలు చేసిన వారి తరపు లాయర్లు మాత్రం ఖచ్చితంగా స్టేటస్ కో విధించాలని కోరారు.మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి వ్యతిరేకం అని పిటీషనర్ తరపు లాయర్లు వాదించారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని గురించే ఉందని ప్రస్తావించారు. అత్యంత కీలకమైన ఈ పిటీషన్లను ప్రత్యక్ష పద్దతిలో వినాలని పిటీషనర్ తరపు లాయర్లుకోరగా..ఈ సమయంలో తాము ప్రత్యక్షంగా హాజరుకాలేమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వెల్లడించారు.