Telugu Gateway
Andhra Pradesh

మూడు రాజధానులు...ఏపీ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ

మూడు రాజధానులు...ఏపీ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ
X

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులోనూ నిరాశే ఎదురైంది. మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు బిల్లుల అంశంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. ఈ స్టేటస్ కో తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పలు బెంచ్ ల మార్పు అనంతరం బుధవారం నాడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది.

అయితే ఈ కేసును విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే విన్పించాలని సూచించారు. హైకోర్టు ఈ కేసును విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. రాకేష్ ద్వివేది రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు విన్పించారు. హైకోర్టులో గురువారం విచారణ ఉన్న దశలో తమ దగ్గరకు రావటం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఆర్ ఏ షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు సన్నాహక పనులకు స్టేటస్‌ కో అడ్డంకిగా మారిందని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది నివేదించారు. సుప్రీం ధర్మాసనం ప్రత్యేకంగా ఈ అంశంపై న్యాయవాది నారిమన్ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటు అయిందని..రాష్ట్రపతి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై అసెంబ్లీలో చట్టం చేయరాదని తెలిపారు. అలాంటిది దీనిపై చట్టం చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెబుతుందని నారీీమన్ ప్రశ్నించారు. అయితే సుప్రీం మాత్రం ప్రభుత్వం కోరుతున్నట్లు హైకోర్టు వేగంగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోరింది.

Next Story
Share it