ఉమ్మడి సెక్రటేరియటే 25 ఎకరాల్లో..గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలా?

ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన హైదరాబాద్ లోని పాత సచివాలయం విస్తీర్ణమే 25.5 ఎకరాలు. మరి అలాంటిది ఓ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు అవసరమా?. అక్కడ కట్టేది గెస్ట్ హౌసా?. లేక సచివాలయం లాంటి భవనాలా?. ఏపీ సర్కారు గురువారం నాడు విశాఖపట్నంలోని కాపులుప్పాడ కొండపై గెస్ట్ హౌస్ కు అంటూ 30 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా ఎంపిక చేసినందున అక్కడ స్టేట్ గెస్ట్ హౌస్ కట్టుకోవటాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కొత్తగా కట్టేదానికి సకల హంగులతో తీర్చిదిద్దొచ్చు. కానీ ఓ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఏముంది?. అంత భారీ స్థాయిలో అక్కడ గెస్ట్ హౌస్ కట్టాల్సిన అవసరం ఏముంది?. చంద్రబాబునాయుడు రాజధానికి 33 వేల ఎకరాలు అన్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి.
మెజారిటీ అభిప్రాయం కూడా రాజధానికి అంత భూమి రైతుల దగ్గర నుంచి తీసుకోవటం సరికాదనే. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు కూడా రాజధాని పేరుతో ఇంత భారీ భూసేకరణను తప్పుపట్టారు. మరి ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి ఏకంగా గెస్ట్ హౌస్ కు ఏకంగా 30 ఎకరాలు కేటాయించటం విమర్శలకు తావిస్తోంది. ఎంత పెద్దగా..వివిఐపిల కోసం ఎంత అట్టహాసంగా కట్టినా కూడా 10 ఎకరాలే చాలా ఎక్కువ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబులా హంగామా చేయం..అవసరమైన భవనాలు మాత్రమే కడతామని చెబుతున్న సర్కారు ఓ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయించటం విశేషం.