Telugu Gateway
Politics

కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు..కమిషన్లపైనే

కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు..కమిషన్లపైనే
X

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సీఎం కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.ఇందులో తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు, కమిషన్ల మీదే తప్ప ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే ఉద్దేశాలు లేవన్నారు. కృష్ణా జలాల విషయంలో కెసీఆర్ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు. టీఆర్ఎస్, వైసీపీలకు చెందిన కీలక నేతలు ఆ రాష్ట్రం వారు ఇక్కడ, ఈ రాష్ట్రం వారు అక్కడ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ, కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలు ఒకరు రక్షించుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలను మాత్రం తాకట్టుపెట్టి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కెసీఆర్ పరోక్ష సహకారం ఉందన్నారు. అపెక్స్ కౌన్సిల్ వాయిదాకు మీరు లేఖ రాయడం దీనికి నిదర్శనం అన్నారు.

నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించారు. ‘లక్షా 7 వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం మీదే. పాలమూరు-రంగారెడ్డి స్కీంతో నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు ఒరిగేది ఏమీ లేదు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీం సామర్థ్యం ఒక టీఎంసీ తగ్గించారు. తద్వారా ఆ ప్రాజెక్టు నుంచి నారాయణపేట్,కొడంగల్ కు నీళ్లు రావడం కల్లే. నారాయణపేట్-కొడంగల్ స్కీం ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైంది. తొలి దశకు రూ.133 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా ఆ ప్రాజెక్టును తొక్కిపెట్టారు. నారాయణపేట్-కొడంగల్ స్కీంను తక్షణం ప్రారంభించాలి. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే... మీరు సక్రమ ప్రాజెక్టులు కూడా కట్టడం లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై సుప్రీంలో వేసిన కేసులో పసలేదు. వైసీపీ కీలక నేతలు తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల పనులు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it