Telugu Gateway
Politics

‘కొత్త రికార్డు’ సృష్టించనున్న నరేంద్రమోడీ

‘కొత్త రికార్డు’ సృష్టించనున్న నరేంద్రమోడీ
X

ప్రధాని నరేంద్రమోడీ కొత్త ‘రికార్డు’ సృష్టించబోతున్నారు. ఇఫ్పటికే ఓ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఆయన పదవీ కాలం పూర్తయ్యేలోగా తన పేరిట సరికొత్త రికార్డును నమోదు చేసుకోవటం ఖాయం. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను మోదీ అందుకున్నారు. దివంగత అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా 2268 రోజులు ఉండగా, మోదీ ఆ రికార్డును గురువారంతో చెరిపేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ల తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. మోదీ దేశ 14వ ప్రధానమంత్రిగా 2014 మే 26న ప్రమాణస్వీకారం చేయగా, 2019, మే 30న రెండోసారి కీలక బాధ్యతలను చేపట్టారు.

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ 17 సంవత్సరాల పాటు అత్యున్నత పదవిని చేపట్టి దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన రికార్డు సాధించారు. మరో రెండు రోజుల్లో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం ప్రధాని పగ్గాలు చేపట్టిన నాలుగో నేతగా అరుదైన ఘనతను సాధించారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం తిరిగి మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టింది మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీలే కావడం విశేషం.

Next Story
Share it