Telugu Gateway
Telugugateway Exclusives

మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోలపై డిస్ లైక్ ల ఎటాక్!

మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోలపై డిస్ లైక్ ల ఎటాక్!
X

ఇది దేనికి సంకేతం?

ప్రధాని నరేంద్రమోడీ. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియాను ఓ అస్త్రంగా మలచుకుని యువతను ఆకట్టుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా మోడీకి వ్యతిరేకంగా మారుతోందా?. ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 30న నిర్వహించిన ‘మన్ కీ బాత్’ వీడియోలకు ఇంత భారీ స్థాయిలో డిస్ లైక్ ల ఎటాక్ ఎందుకు మొదలైంది. మామూలుగా ఇష్టం ఉన్న వారు వింటారు లేదంటే వదిలేస్తారు. కానీ పనిగట్టుకుని డిస్ లైక్ లు కొట్టారంటే ఇది ప్రధాని నరేంద్రమోడీపై యువతలో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగా భావించాలా?. చూస్తుంటే పరిస్థితులు అలాగే కన్పిస్తున్నాయి. మన్ కీ బాత్ వీడియోల కింద కామెంట్లు కూడా మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. 30 లక్షల కు పైగా యూ ట్యూబ్ సబ్ స్క్రైబర్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ మన్ కీ బాత్ వీడియోను అప్ లోడ్ చేసింది. ఈ వీడియోను కేవలం 38 వేల మంది మాత్రమే లైక్ చేయగా, ఏకంగా 3.01 లక్షల మంది ఈ వీడియోను డిస్ లైక్ చేశారు.

సోమవారం ఉదయం పదిన్నర గంటల వరకూ ఉన్న పరిస్థితి ఇది. డీడీ నేషనల్ యూట్యూబ్ ఛానల్ లో కూడా లైక్ ల కంటే డిస్ లైక్ లే ఎక్కువ ఉండటం విశేషం. డీ డీ నేషనల్ లో మన్ కీ బాత్ వీడియోకు మూడు వేల మూడు వందల మంది మాత్రమే లైక్ చేయగా..డిస్ లైక్ చేసిన వారి సంఖ్య 5900 మంది ఉన్నారు. ముఖ్యంగా దూరదర్శన్ వీడియో కింద కామెంట్లు చేసిన యువత ఉద్యోగాల అంశాన్నే ప్రస్తావించారు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే తమను మోసం చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిజెపి యూట్యూబ్ వీడియో లింక్ కింద కూడా ఇదే తరహా కామెంట్స్ ఉన్నాయి. విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ దీనిలో కామెంట్స్ పెట్టారు. చూస్తుంటే యువత ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో మోడీ సర్కారుపై వ్యతిరేకంగా ఉన్నట్లే కన్పిస్తోంది.

Next Story
Share it