ఫోన్ ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు

ఏపీ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటీషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు విన్పించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే తన దగ్గర ఉన్న ఆధారాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆగస్టు 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేశారు. చీఫ్ జస్టిస్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
జడ్జీల కదలికలను పరిశీలించేందుకు కూడా ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమించారని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ తెలిపారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా.. అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది శ్రవణ్ చెప్పారు. రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని అన్నారు. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని.. దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.