Top
Telugu Gateway

ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కళ్యాణ్ డిమాండ్

ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కళ్యాణ్ డిమాండ్
X

రైతుల కోసం టీడీపీ...ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలి

ప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలనే

వైసీపీ వ్యక్తిగత పాత కక్షలతోనే రాజధాని మార్పు

జనసేన పీఏసీలో నేతల వ్యాఖ్యలు

రాజధాని అమరావతి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక డిమాండ్ చేశారు. రాజధాని రైతుల కోసం టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు గంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతున్నందున రాజీనామాలు చేసి పోరాడాలన్నారు. రాజధాని విషయంలో ప్రశ్నించాల్సింది టీడీపీ, వైసీపీలను మాత్రమే అన్నారు. ఇందులో జనసేన పాత్రమీలేదన్నారు. తమకు ఏ మాత్రం పాత్ర ఉన్నా రాజీనామాల విషయంలో తాము ముందు ఉండేవారమన్నారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట పాలకులే ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాజధాని అంశంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం నాడు సమావేశం అయి విస్తృతంగా చర్చించింది. అమరావతిలో రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రాజధాని పరిరక్షణ వరకూ ప్రతి దశలోనూ రైతు పక్షపాతంతో గొంతు వినిపించిందీ... ఒకే మాటపై నిలిచిందీ జనసేన మాత్రమే అని చెప్పారు. పీఏసీ సమావేశంలో కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, కె. నాగబాబు, తోట చంద్రశేఖర్, టి. శివశంకర్, సత్య బొలిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఓ క్రీడకు తెర తీశారని ఆరోపించారు.

రైతులకు అన్యాయం చేయడంలో వైసీపీ, టిడిపి పార్టీలు రెండూ ఒకలాంటివే. రూ.లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తాం అని తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు రూపొందించిన సమయంలోగానీ, మూడు రాజధానులుగా మారుస్తామని వైసీపీ నిర్ణయించిన సమయంలోనూ జనసేనకు ప్రమేయం లేదు. తప్పు చేసింది వైసీపీ, తెలుగుదేశం పార్టీలయితే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు. నిలదీయాలనుకున్న వారు ఆ రెండు పార్టీల పెద్దలను నిలదీయాలి. అసలు అమరావతి నిర్మాణం విషయంలో ఆది నుంచి ఇప్పటి వరకూ జనసేన ప్రమేయమే లేదు. అయితే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా అన్యాయమవుతున్న రైతుల పక్షాన పోరాడుతున్నామని తెలిపారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రక్రియ ప్రకారం చేసినది కాదు. వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు... వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో మంత్రులకు కూడా రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తెలియవు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకైతే ఏం జరుగుతుందో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు వాణిజ్య దృక్పథంతో రాజధాని నిర్మాణం విషయంలో కాలయాపన చేశారు. రాజధానికి సంబంధించి బలమైన చట్టం తీసుకువచ్చే విషయంలో శ్రద్ధపెట్టలేదు.

ఆ అలసత్వం ఫలితంగానే ఇక్కడి నుంచి రాజధానిని వికేంద్రీకరిస్తున్నారు. అయిదేళ్లు చంద్రబాబు బీద ఏడుపులు ఏడుస్తూ దీక్షలు చేశారు తప్ప రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా వెళ్లలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రాజధాని వికేంద్రీకరణ అంటూ కాలం దొర్లిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరచింది. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. ఒప్పందం ఉల్లంఘించి ప్రభుత్వమే ప్రజలను మోసం చేయడం ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలోనే జరుగుతోంది.’ అని విమర్శించారు. ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ “అమరావతి అంశానికి సంబంధించి న్యాయ పోరాటం మార్గం ఉంది. మూడు రాజధానుల అంశానికి ప్రజలందరి ఆమోదం ఉన్నట్లుగా లేదు. రాజధానులు పెడతామని చెబుతున్న ప్రాంతాల్లోని ప్రజల్లో కూడా ఉత్సాహం కనిపించడం లేదు.

అమరావతి విషయంలో పెద్ద తప్పిదం చేసింది చంద్రబాబు నాయుడే. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాజధాని తరలింపునకు ఆస్కారం కల్పించాయి. ప్రభుత్వమే ఈ విధంగా రైతులతో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇక ప్రజలకు ప్రభుత్వంపై ఏ విశ్వాసం ఉంటుంది” అన్నారు. పీఏసీ సభ్యుడు కె.నాగబాబు మాట్లాడుతూ “ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రభుత్వమే మోసం చేస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు. నాడు ఆయన చేసిన తప్పిదాలనే నేడు జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టడం అనేది పక్కా వ్యూహం ప్రకారం జరుగుతున్న కార్యక్రమం.’ అని తెలిపారు.

Next Story
Share it