బిజెపి ట్యూన్స్ కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ డ్యాన్స్!
BY Telugu Gateway29 Aug 2020 5:20 PM IST

X
Telugu Gateway29 Aug 2020 5:20 PM IST
రైతులకు న్యాయమంటారే తప్ప..రాజధానిపై స్పష్టమైన వైఖరి ఏది?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి ట్యూన్స్ కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారా?. అంటే శనివారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ అనంతరం మీడియాకు విడుదల చేసిన ప్రకటన చూస్తే అదే స్పష్టం అవుతోంది. అందులో ఎక్కడా కూడా రాజధాని అమరావతిలోనే ఉండాలని ఒక్కటంటే ఒక్క ముక్క మాట్లాడలేదు. ఒకటే రాజధాని అన్నది తమ వైఖరి అని కూడా ఏమీ తేటతెల్లం చేయకుండా రాజధానికి 33 వేల ఎకరాలు ఇఛ్చిన రైతులకు అన్యాయం జరగకూడదు, ఇప్పటికే అక్కడ కొన్ని నిర్మాణాలు చేశారు..కొంత వ్యయం చేశారు అంటారే తప్ప..రాజధాని అమరావతిలో ఉండాలా..వద్దా అనే విషయంపై మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది బిజెపి బాటేనని తేలిపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్న సమయంలో అమరావతి కోసమే ఒప్పందం చేసుకున్నామని..సీఎం జగన్ ఒక వేళ రాజధాని తరలించినా మళ్ళీ వెనక్కి తీసుకొస్తామని ప్రకటించారు. ఎప్పుడైతే ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారో అప్పటి నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది.
రాజధాని విషయంలో అసలు కేంద్రం జోక్యం చేసుకోదని..తాము రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నట్లు కన్పిస్తోంది. ముందు ఓ మాట చెప్పి తర్వాత మాట మార్చిన వారిలో చంద్రబాబు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి సీఎం జగన్ వరకూ అందరూ ఓ జాబితాలోనే ఉంటారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ జాబితాలో చేరిపోయినట్లే కన్పిస్తోంది. రైతులకు న్యాయం జరుగుతుందా...అన్యాయం జరుగుతుందా అన్నది ఎలాగూ తేలిపోతుంది. కానీ అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో మాత్రం స్పష్టంగా చెప్పకుండా గోడమీద పిల్లి తరహాలో వ్యవహరిస్తున్నారు.
Next Story