Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర?!

నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర?!
X

జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత జనంలోకి

రెండేళ్ళ పాటు జనంలోనే ఉండేలా కసరత్తు

పాదయాత్ర. పవర్ కు దగ్గర చేసే ఓ ఆటోమేటిక్ మిషన్ గా మారింది ఏపీలో. దివంగత వైఎస్ పాదయాత్ర ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి పవర్ లోకి వచ్చారు. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూనే అధికారంలో వచ్చారు. చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత ఒకెత్తు..జగన్ నిత్యం ప్రజల్లో ఉండటంతో ఒక్క ఛాన్స్ నినాదంతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇదే ఫార్ములాతో ముందుకు రాబోతున్నారా?. దీనికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అంటే ఔననే చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. అందులో భాగంగానే లోకేష్ బరువు తగ్గి తన బాడీని పాదయాత్రకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత నారా లోకేష్ రోడ్డెక్కి ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

జగన్ పాదయాత్ర ఇప్పుడు ఓ రికార్డుగా ఉంది. ఆయన ఏకంగా 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ రికార్డును చెరిపేసేలా నారా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందనే చెప్పొచ్చు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొంత మంది పక్కకు వెళ్లిపోయారు. మరికొంత మంది కూడా ఇదే బాటలో ఉన్నారు. మరో వైపు జగన్ సర్కారు గత చంద్రబాబు పాలనలో అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసులకు సిఫారసులు చేసింది. గతంలో అధికారం అనుభవించిన చాలా మంది టీడీపీ నేతలు ప్రస్తుతం ఎక్కడా కన్పించే పరిస్థితి లేదు. దీనికితోడు నారా లోకేష్ కు ...సీనియర్ నేతలకు మధ్య పార్టీలో ‘గ్యాప్’ కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నారా లోకేష్ కూడా ఎక్కువ మంది పాత వారితో కాకుండా సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకుంటే తనకు సౌలభ్యంగా ఉంటుందనే భావనలో ఉన్నారు. అయితే అది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అన్నది వేచిచూడాల్సిందే. గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరిలో ఓటమి పాలవటం రాజకీయంగా ఓ మైనస్ పాయింట్ గా మారింది. ఏది ఏమైనా నేరుగా ప్రజల్లోకి వెళ్లి లీడర్ గా ఎస్టాబ్లిష్ అవటానికి అవసరమైన కసరత్తు ప్రస్తుతం సాగుతోందని...ప్రస్తుతం ప్రణాళికల అన్నీ ఈ దిశగానే సాగుతున్నాయని చెబుతున్నారు. మరి పాదయాత్ర మ్యాజిక్ లోకేష్ కు కూడా వర్కవుట్ అవుతుందా?. అంటే వేచిచూడాల్సిందే.

Next Story
Share it