కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సెప్టెంబర్ 4న

ఎట్టకేలకు విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో పనులు నిలిచిపోయాయి. ఇటీవలే ఈ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 4న విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కలిసి ఫ్లై ఓవర్ పనులను మంత్రి తనిఖీ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను వచ్చే నెల 4న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. వచ్చే నెల 4న ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్‌కు చెందిన 13 వేల కోట్ల రూపాయల పనులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు.