Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ బాధ్యత బిజెపి ఏజెండా అమలేనా?!

పవన్ కళ్యాణ్ బాధ్యత బిజెపి ఏజెండా అమలేనా?!
X

పీఏసీ నిర్ణయాలతో స్పష్టమైన ‘రాజకీయం ఏజెండా’

చంద్రబాబు అమరావతి కడతానన్నారు...కట్టలేదు. జగన్ అమరావతిని మారుస్తాననలేదు. మార్చటానికి రెడీ అయ్యారు. ఈ రెండు నిర్ణయాల్లో తనకు ఏ మాత్రం పాత్ర లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో నిజనిజాలను కాసేపు పక్కన పెడదాం. పైగా ప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలను అయితే తమను ప్రశ్నించటం ఏంటి అంటూ ఆదివారం నాడు జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అందరినీ ఆయన ప్రశ్నించవచ్చు కానీ..ఆయన్ను ఎవరూ ప్రశ్నించకూడదన్నమాట. ఇదే పవన్ కళ్యాణ్ కేవలం అమరావతి కోసమే బిజెపితో కలిశానని..ఈ మేరకు ‘బిజెపితో ఒప్పందం’ కూడా రాసుకున్నట్లు ప్రకటించారు. ఒక వేళ మార్చినా రాజధానిని మళ్ళీ అమరావతికే తెస్తామని ప్రకటించారు. అది కూడా ఎక్కడ అంటే అమరావతిలో రాజధాని రైతులతో సమావేశం అయినప్పుడు ఈ విషయాలు ప్రకటించారు. అంతే కాదు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు.

నవరత్నాల కోసం రైతులు భూములు ఇవ్వలేదని, రాజధానిని కదిలించే శక్తి జగన్ కు లేదని వ్యాఖ్యానించారు. సరే ఈ అంశాలు అన్నింటిని పక్కన పెడితే జనసేన బిజెపితో కుదుర్చుకున్న ‘అమరావతి ఒప్పందం’ సంగతి ఇప్పుడు ఏమైంది?. అసలు జనసేన పీఏసీ సమావేశంలో ఈ అంశం ఎందుకు ప్రస్తావనకు రాలేదు?. తప్పు అంతా టీడీపీ, వైసీపీలదే అన్నట్లు వ్యవహరిస్తూ పూర్తిగా బిజెపిని వదిలేయటం వెనక మతలబు ఏమిటి?. కేంద్రంలో అప్రతిహతమైన మెజారిటీతో అధికారం చలాయిస్తున్న బిజెపి తలచుకుంటే రాజధానిని అమరావతి నుంచి మార్చకుండా నిలువరించలేదా?. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వమే కదా రాజధాని భవనాల నిర్మాణానికి నిధులు ఇఛ్చింది?. పోనీ బిజెపి సంగతి పక్కన పెడితే కేవలం అమరావతి కోసమే బిజెపితో జట్టుకట్టానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ అంశంపై అసలు మాట కూడా మాట్లాడకుండా న్యాయనిపుణులతో చర్చిస్తామనటం వెనక మతలబు ఏంటి?.

అసలు బిజెపి తలచుకుంటే న్యాయనిపుణుల అవసరం ఏముంది?. బిజెపి రాష్ట్ర పార్టీ అమరావతి కి అనుకూలం అయితే..కేంద్ర పార్టీ వ్యతిరేకమా?. కేంద్ర పార్టీ వ్యతిరేకిస్తే రాష్ట్ర పార్టీ సొంత నిర్ణయం తీసుకుంటుందా?. అంటే అంతా పొలిటికల్ గేమ్. ఏపీలో బిజెపి ఏజెండా అమలుకు పవన్ కళ్యాణ్ ఓ అస్త్రంగా ఉపయోగపడబోతున్నారు. తాజా పరిణామాలు అన్నీ ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఢిల్లీలో బిజెపి కీలక నేతలను కలసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అమరావతి కోసమే జట్టుకడుతున్నట్లు తెలిపారు. అంటే ఏపీలో బిజెపి తన రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ ద్వారా అమలు చేయనుందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it