Telugu Gateway
Andhra Pradesh

ప్రణాళిక ప్రకారమే అమరావతి భవనాల ఉపయోగం

ప్రణాళిక ప్రకారమే అమరావతి భవనాల ఉపయోగం
X

అమరావతిలో పెండింగ్ లో ఉన్న భవనాల పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి ఎంత వ్యయం అయినా వేగంగా పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ భవనాలను ఎలా..ఎందుకు ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వానికి ఓ ప్రణాళిక ఉందని..దాని ప్రకారమే ముందుకు వెళతామని తెలిపారు. సీఆర్ డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే విశాఖపట్నంలో శంఖుస్థాపన చేయాలని భావించామని బొత్స పేర్కొన్నారు. టీడీపీ లాంటి కొన్ని దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. శంఖుస్థాపన కార్యక్రమం ఎట్టిపరిస్థితుల్లో ఆగదని స్పష్టం చేశారు. శంకుస్థాపనకు ప్రధానమంత్రిని, దేశంలోని పెద్దలను అందరినీ పిలుస్తామని తెలిపారు.

శుభకార్యాలు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయమని గుర్తుచేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తమ బాధ్యత అని, ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. లేనిపోని అనుమానాలు పెట్టికోవద్దని, ప్రతిపక్షం మాటలు ఏమాత్రం నమ్మ వద్దని తెలిపారు. అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం చంద్రబాబుకి ఇష్టంలేదని, ఓటమి చెందినప్పటి నుంచి ఆయన బాధ్యత విస్మరించారని మండిపడ్డారు. బాబు బాధ్యతను కూడా తాము తీసుకున్నామని తెలిపారు. సీఎం జగన్ గురువారం నాడు అమరావతి అంశంపై సమీక్ష నిర్వహించారు.

Next Story
Share it