Telugu Gateway
Andhra Pradesh

‘అమరావతి’పై నోరెత్తని ఆ మాజీ మంత్రులు

‘అమరావతి’పై నోరెత్తని ఆ మాజీ మంత్రులు
X

నారాయణ..పుల్లారావులు ఎక్కడ?!

టీడీపీలో చర్చనీయాంశం అయిన నేతల వైఖరి

తెలుగుదేశం హయాంలో అమరావతి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తర్వాత చక్రం తిప్పిన వాళ్లలో మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులే కీలకం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అంతా తానై నడిపించారు. కట్టించిన భవనాలు కూడా అత్యంత నాసిరకంగా..ఏ మాత్రం సౌకర్యవంతంగా లేకుండా చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. టెండర్ల దగ్గర నుంచి అన్ని ఆర్ధిక లావాదేవీలు నారాయణ ద్వారానే సాగేవి. చంద్రబాబు, నారాయణలకు ఉన్న ‘సంబంధాల’ కారణంగానే ఆయనపై చంద్రబాబు కూడా అప్పట్లో నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గత కొంత కాలంగా అమరావతిపై రాజకీయ వివాదం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం రాజకీయ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవటంతో ‘అమరావతి’ అసెంబ్లీకి పరిమితం కానుంది. ఇంత జరుగుతున్నా కూడా అమరావతి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు నేతలు బయటకు వచ్చి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.

మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులు గాయబ్ అయిపోయారు. వీళ్లు బయటకు వచ్చి మాట్లాడితే ఏదో జగన్ నిర్ణయం మార్చుకుంటారు అని కాదు కానీ అంతలా దగ్గర ఉండి పని చేసిన ప్రాంతం కాకుండా..మరో ప్రాంతానికి రాజధానిని తరలిస్తుంటే బయటకు వచ్చి ఓ ప్రకటన చేసే సాహసం కూడా వీళ్ళు ఎందుకు చేయటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చలాయించి..అందరినీ బెదిరించి..ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండటం ఎంత వరకూ సమంజసం అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే ఆర్ధిక కోణంలో చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం పోరాటానికి వేరే వాళ్లు రావాలి అన్న చందంగా వ్యవహరించటం మామూలే అని కొంత మంది నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే కారణంతో చాలా మంది నేతలు కూడా పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నారాయణ, పుల్లారావులు అమరావతిలో వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏకంగా పుస్తకం కూడా ముద్రించింది. అందులో నారాయణ ఏకంగా 3129 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని అందులో పేర్కొన్నారు. 432 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ భూముల విలువ అప్పట్లో పది వేల కోట్ల రూపాయలు పేర్కొంది.

మరో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా అసైన్ మెంట్ భూములతో కలుపుకుని 196 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఆ పుస్తకంలో ప్రచురించారు. 39 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ భూమి విలువ అప్పట్లో 784 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ అక్రమ భూ లావాదేవీల కారణంగానే వీరు బయటకు రావటం లేదా?. బయటకు వచ్చి అమరావతి కోసం గట్టిగా మాట్లాడితే జగన్ సర్కారు కేసులు పెడుతుందని భయపడుతున్నారా?. అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది. వీళ్లిద్దరే కాదు..అధికారంలో ఉండగా హవా చెలాయించిన వారిలో చాలా మంది ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. ఇది అంతా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల స్వయంతృతమే అన్న విమర్శలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి.

Next Story
Share it