Telugu Gateway
Andhra Pradesh

డొక్కా..అవసరాలకు అనుగుణంగా మెలితిరిగే నేత

డొక్కా..అవసరాలకు అనుగుణంగా మెలితిరిగే నేత
X

డొక్కా మాణిక్యవరప్రసాద్. అవసరానికి అనుగుణంగా ఎటు అంటే అటు మెలితిరిగే సామర్ధ్యం ఉన్న నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ‘మనసులో మాట’ పుస్తకంలో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడారని..చంద్రబాబును డ్యామేజ్ చేయటంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత తిరిగి రైతు వ్యతిరేకిగా చెప్పిన అదే చంద్రబాబు పార్టీ టీడీపీలో చేరారు. చంద్రబాబు కూడా ఎంచక్కా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను టీడీపీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది అంతా పాత కథ. జగన్మోహన్ రెడ్డి సర్కారు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి లేఖ రాశారు.

అందులో ఆయన చెప్పిన అంశాలు ఏంటో తెలుసా?. ‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు రాజధానుగా విభజించటాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్ర విభజన ప్రతిపాదన రాగానే విభజిత నవ్యాంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ అసెంబ్లీలోనూ, బయటా ప్రయత్నించి ఉన్నాను. ’ అంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న వైసీపీలో చేరి...రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. కానీ సోమవారం నాడు ఆయన ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు. ‘రాజధాని ఉద్యమంతో దళితులకు ఎలాంటి సంబంధం లేదు. ఇది దళిత ఉద్యమం కాదు. ఈ రాజధాని వల్ల వాళ్లకు వచ్చింది ఏమీ లేదు. ఇళ్ళ స్థలాలు ఇవ్వటం అంటే అపోజ్ చేయటం ఎంత వరకు సమంజసం. రాజధాని ఉద్యమంలోని రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలకు ఉపయోగపడేలా కొంత మంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రిని నిందించటం సరికాదు. మీ డిమాండ్లు ఏంటి. ప్రభుత్వానికి చెప్పండి. అంతే కానీ దూషిస్తే సమస్యలు పరిష్కారం కావు.

సీఎం రైతుల సమస్యలు పరరిష్కరించటానికి సిద్ధంగా ఉన్నారు. దళితుల భూమి వాళ్లకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వం వద్దకు మీ డిమాండ్లు తెండి. జగన్ సర్కారు పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంటే. దీనిపై కోర్టులో కేసు వేశారు. పేదలకు ఇళ్ళు ఇస్తే ఇక్కడ పేదవర్గాలు..దళితులు ఇళ్ళు కట్టుకుంటే ఇక్కడ డెమోగ్రాఫిక్ చేంజ్ వస్తుంది. అంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. అంటే మేము ఒక సమాజం ఉంది ఆ సమాజం సమతుల్యత దెబ్బతింటుంది అని వాళ్ళు రాసిన ధైర్యాన్ని కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ చేయటం ఎంత వరకూ సమంజసం.

కోర్టులు దీన్ని ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేయాలి. సుమోటోగా కోర్టు తీసుకోవాలి. ఇక్కడ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అన్నందుకు వాళ్లపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాల్సింది పోయి పిటీషన్ ను ఎలో చేశారంటే చాలా శోచనీయం అని వ్యాఖ్యానించారు. అంటే మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేశానని చెప్పి...ఆ నిర్ణయం తీసుకున్న పార్టీలో చేరి..అక్కడే ఎమ్మెల్సీ పొంది..ఇప్పుడు అదే మూడు రాజధానులకు జై కొట్టడం అంటే మామూలు విషయం ఏమీకాదు. అయితే ఇలా మాట మార్చిన వారిలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏమీ మొదటివారు కాదు..చివరి వ్యక్తీ కాదు.

Next Story
Share it