Telugu Gateway
Politics

కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు

కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు
X

ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

కరోనా చికిత్సకు పది వేల రూపాయలకు మించి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్, మందులు అన్నీ కలిపితేనే అంత అవుతుందని పేర్కొన్నారు. కరోనాకు రోజుకు లక్ష, రెండు లక్షలు అయ్యే చికిత్స అసలు లేదన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం నాడు టిమ్స్ ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలుగా వ్యవహరించి వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అన్ని జిల్లాల్లో ఐసీయూ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని చెస్ట్, కింగ్ కోఠి, ఫీవర్ ఆస్పత్రుల్లో కావాల్సినన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా రోగికి మందుల కంటే ఆక్సిజన్ ముఖ్యమని, ఆగస్టు 10 లోపు లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. లక్షణాలు కన్పించగానే కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరాలని..కొంత మంది నాలుగైదు రోజుల జాప్యం చేయటం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్ గా తేలి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉంటే తక్షణమే ఆస్పత్రిలో చేరాలని ఈటెల సూచించారు. టిమ్స్ ను పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చామని తెలిపారు.

Next Story
Share it