Telugu Gateway
Telangana

కరోనాకు కార్పొరేట్ లో అయినా..గాంధీలో అయినా అదే చికిత్స

కరోనాకు కార్పొరేట్ లో అయినా..గాంధీలో అయినా అదే చికిత్స
X

మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు

వైఖరి మారకపోతే కఠిన చర్యలు తప్పవు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

కరోనాకు కార్పొరేట్ ఆస్పత్రిలో, గాందీ, గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్ సీ అయినా ఒకటే చికిత్స అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 15 పైసల ట్యాబ్లెబ్లు, పది రూపాయల ఇంజెక్షన్లే తప్ప వేలాది రూపాయల ఖరీదు అయినవ ఏమీ ఇందులో లేవన్నారు. ఈ చికిత్స అంతా కలిపితే కూడా వెయ్యి రూపాయల మించదంటున్నారని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ కూడా ఒక పేషంట్ కు పది రోజులు పెడితే దానిపై అయ్యే వ్యయం కూడా 2500 రూపాయలు మాత్రమే అన్నారు. పరిస్థితి విషమించకముందు వైద్యుల దగ్గరకు వెళితే బయటపడతారని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు రాగానే వెంటనే పీహెచ్ సీల్లో పరీక్షలకు వెళ్లాలని సూచించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని ఈటెల సూచించారు. గతంలో కరోనా కన్నా భయంకరమైన వైరస్‌లు ఎన్నో వచ్చాయి కానీ.. ఇంత నష్టం జరగలేదన్నారు. ప్రజలు ఎవరూ కరోనాకు భయపడొద్దని సూచించారు.

వైరస్‌ లక్షణాలున్నవారికి టెస్టులు చేయాలని స్పష్టం చేశారు. పీహెచ్‌సీ స్థాయిలోనే కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్య అధికారులతో రివ్యూ నిర్వహించామన్నారు. కరోనా చికిత్సపై గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈటల. గతంలోలాగా ప్రైవేట్‌ ఆస్పత్రులు కరోనా వైద్యాన్ని కూడా వ్యాపారంగా భావించొద్దని కోరారు. అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఈటల రాజేందర్‌. కొన్ని ఆస్పత్రులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.. పేషంట్ వెళ్లగానే రెండు లక్షలు కట్టాలు..మూడు లక్షలు కట్టాలని వేధిస్తున్నారని విమర్శించారు.

పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు అందుతున్నాయని..కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటకే ఓ ఆస్పత్రి పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత నాలుగైదు నెలల అనుభవాలను చూస్తే వైరస్ అంటుకోగానే మనిషి చనిపోడని అన్నారు. కాకపోతే ఈ వైరస్ ప్రపంచాన్ని ఆగమాగం చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరతలేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా రోజుకు గరిష్టంగా తొమ్మిది వేల రూపాయలు మించి తీసుకోవద్దని సూచించామన్నారు. లక్షణాలు లేకుండా ఎవరూ అనుమానంతో పరీక్షలు చేయించుకోవద్దని ఈటెల సూచించారు.

Next Story
Share it