Telugu Gateway
Andhra Pradesh

చివరకు న్యాయమే గెలుస్తుంది

చివరకు న్యాయమే గెలుస్తుంది
X

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆయన ఇళ్ళ పట్టాల విషయంలో టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. సీఎం జగన్ మంగళవారం నాడు తన కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుంది’’ అని పేర్కొన్నారు. 22వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను.. 30లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని తెలిపారు. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ పాఠశాలను వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 55వేల అంగన్‌వాడీల్లో నాడు-నేడు కింద పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలనే ఆలోచన ఉన్నందున.. అంతకంటే ముందే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా ఆర్థిక సహాయం అందించామని.. బ్యాంకులకు ఈ డబ్బుపై ఎలాంటి హక్కు లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పారు. ఎక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి.. హిందూస్థాన్‌, యూనిలీవర్, ఐటీసీ, పీ&జి, రిలయన్స్, అమూల్‌ తదితర గ్రూపులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి మంత్రుల బృందం రివ్యూ చేస్తుందని తెలిపారు.

Next Story
Share it