Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో నిజాయతీపరులు ప్రశ్నించాలి

వైసీపీలో నిజాయతీపరులు ప్రశ్నించాలి
X

అధికార వైసీపీలోని నిజాయతీపరులు అమరావతిపై సీఎం జగన్ మాట తప్పిన తీరు గురించి ప్రశ్నించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు అమరావతిపై ఏమేమి మాట్లారనే అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్పులను చంద్రబాబు విలేకరుల సమావేశంలో చూపించారు. ఎన్నికలకు ముందు ఓ మాట చెప్పి..తర్వాత ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ అంశంపై సీఎం జగన్ ను అందరూ ప్రశ్నించాలన్నారు. రాష్ట్ర విభజన కంటే సీఎం జగన్ ఏపీకి ఇంకా పెద్ద అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుందని ప్రకటిస్తే రాజీనామాలు చేయటానికి తాము రెడీ అన్నారు. లేదంటే జగన్ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఎంఓయూ చేశాం. అగ్రిమెంట్ చేశాం.

రైతుల నమ్మకాన్ని కాపాడాలి. రాజధాని తరలించాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. చట్టపరంగా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ రెండు రోజుల్లో బయటపెడతా.’ అని తెలిపారు. అమరావతి రైతులు కోర్టుకు వెళితే న్యాయస్థానం స్టే ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అమరావతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. రైతుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందన్నారు. రైతుల కోసం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా రద్దు చేసిందని, రాజధానికి డబ్బులిచ్చారని, ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఆర్డర్‌తో హైకోర్టును ఏర్పాటు చేశారని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారని చంద్రబాబు అన్నారు. అలాంటిదాన్ని జగన్ మార్చేస్తారా అని ప్రశ్నించారు.

Next Story
Share it