Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కొత్తగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు

ఏపీలో కొత్తగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు
X

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రెండు వేల ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటు కానుంది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని, ఈ పార్కు ద్వారా దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. దీంతోపాటు వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీని ద్వారా 10వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. కటస్టర్ల మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.730 కోట్లు ఖర్చు కానున్నట్లు లెక్కలు వేశారు.

అదే సమయంలో భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపారు. తొలి దశ ఓడరేవు ప్రాజెక్టుకు దాదాపు రూ. 3669.95 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఓడరేవుతో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారతాయని ప్రభుత్వం చెబుతోంది. తొలి దశలో భాగంగా 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హ్యాండ్లింగ్ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇఫ్పటికే తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. వైఎస్ఆర్ పథకంతోపాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ బేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్‌ 1న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్‌ 5న వైఎస్సార్ విద్యాకానుక పథకం, సెప్టెంబర్‌ 11న వైఎస్సార్ ఆసరా పథకాలకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్‌ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు కూడా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్‌లు, షూ, బెల్టు తదితర వస్తువులను 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఏపీ కేబినెట్‌లో అపెక్స్ కౌన్సిల్‌పై కూడా చర్చించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి ఇప్పటివరకు రూ.26 వేల 872 కోట్ల రుణాలు అందించామని.. రూ.60 కోట్లతో టొబాకో రైతులను ఆదుకున్నామని మంత్రి నాని వెల్లడించారు.

Next Story
Share it