Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు
X

కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. నగదుతో పట్టుబడిన ఆ కారు ఏపీకి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది అని న్యూస్18 తమిళ ఛానల్ లో తొలుత వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా తెలుగులో ఇతర ఛానళ్లు..వెబ్ మీడియా పెద్ద ఎత్తున వార్తను క్యారీ చేశాయి. అయితే ఈ కారుపై తొలుత మంత్రి బాలినేనికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని..తర్వాత మరొకరి పేరుతో ఉందనే రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు మాత్రం ఈ డబ్బు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదే అని ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఈ నగదు అంతా తనదేనంటూ ఒంగోలుకు చెందిన ఓ బంగారు వ్యాపారి ముందుకొచ్చారు.

అన్ని ఆధారాలు చూపించి ఆ డబ్బు వెనక్కి తెచ్చుకుంటానని..బంగారం కొనుగోలుకే ఆ మొత్తం చెన్నయ్ తీసుకెళుతున్నట్లు మీడియా ముందు చెప్పాడు. తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. అయితే తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వ్యవహారానికి సంబంధించి లీగల్‌ నోటిసులు ఇచ్చారు. తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ న్యూస్ 18తోపాటు టీవీ5లకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి బాలీనేని లీగల్ నోటీసులు పంపారు. మీడియాతోపాటు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బోండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభీలకు నోటీసులు పంపారు.

Next Story
Share it