Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఇళ్ళ స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

ఏపీలో ఇళ్ళ స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా
X

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రికార్డు స్థాయిలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాల పంపిణీకి ముందు ఉగాది అన్నారు..ఆ తర్వాత వైఎస్ పుట్టిన రోజు అయిన జులై 8 తేదీలను ముహుర్తాలుగా నిర్ణయించారు.తాజాగా ఆగస్టు 15న అనుకున్నారు. ఇప్పుడు అది కూడా వాయిదా పడింది. కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉండటంతోపాటు ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. కోర్టుల్లో కేసులు తేలినా కూడా ఈ పరిస్థితుల్లో లబ్దిదారులతో సమావేశాలు నిర్వహించటం సాధ్యంకాదు అన్న సంగతి తెలిసిందే.

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఇళ్ళ స్థలాల పంపిణీ తేదీ మారుతుందని, ఆగస్టు 15 తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇఫ్పుడు అక్టోబర్ 2ను కొత్త ముహుర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనిపై ప్రస్తుతానికి సర్కారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు . ఇదిలా ఉంటే త్వరలోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు శంకుస్థాపన ఉంటుందని కృష్ణదాస్ వెల్లడించారు. టీడీపీ మూడు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

Next Story
Share it