Telugu Gateway
Andhra Pradesh

రైతులతో చేసుకున్న ఒఫ్పందాన్ని గౌరవించాలి

రైతులతో చేసుకున్న ఒఫ్పందాన్ని గౌరవించాలి
X

అమరావతి రైతులకు ఏపీ సర్కారు కౌలు సకాలంలో చెల్లించకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేయటం ఏ మాత్రం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ లో వార్షిక కౌలు చెల్లించాలి. ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చింది. వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ... ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసింది. 28వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారు. వీరికి ఈ ఏడాది రూ.189.7 కోట్లు కౌలుగా చెల్లించాల్సి ఉంది. సి.ఆర్.డి.ఏ. రైతులతో చేసుకొన్న ఒప్పందాన్ని గౌరవించాలి. కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించాలని రైతులు అధికారులను కోరారు. జూన్ 21వ తేదీన కౌలు విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ కౌలు మొత్తం రాలేదు.

ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుంది. తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం 250 రోజులకి పైబడి రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కౌలు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుంది. ఆ కౌలు మొత్తం అడిగేందుకు సి.ఆర్.డి.ఏ. కార్యాలయానికి వెళ్ళిన 180 మంది రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నాను. తమకు న్యాయంగా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు గర్హనీయం. తక్షణమే రైతులకు రావాల్సిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలి.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it