Telugu Gateway
Andhra Pradesh

కేంద్ర జలశక్తి మంత్రికి జగన్ లేఖ

కేంద్ర జలశక్తి మంత్రికి జగన్ లేఖ
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు లేఖ రాశారు. అందులో అపెక్స్ కమిటీ సమావేశంపై ఏపీ సర్కారు స్పందించలేదనటం సరికాదని పేర్కొన్నారు. అదే సమయంలో జగన్ తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్‌ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌ లు చేపడుతోందని సీఎం జగన్‌ ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ లకు సంబంధించి.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు.

ఆ రెండు ప్రాజెక్ట్‌ లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయన్నారు. మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందన్నారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదన్నారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించానన్నారు. కానీ రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్‌ తెలిపారు. త్వరలో జరగనున్న అపెక్స్ కమిటీ సమావేశంలో మరి ఇద్దరు సీఎంలు ఎలాంటి వాదనలు విన్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ సీఎం కెసీఆర్ తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాసి తన వైఖరిని కూడా అందులో స్పష్టం చేశారు.

Next Story
Share it