Telugu Gateway
Andhra Pradesh

రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి

రఘురామకృష్ణంరాజుపై వేటు వేయండి
X

అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు సంబంధించి మీడియాలో మాట్లాడిన వీడియో క్లిప్పింగులతోపాటు సుదీర్ఘ ఫిర్యాదును అందజేశారు. గత కొన్ని రోజులుగా రఘరామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. దీంతోపాటు పార్టీ పేరుకు సంబంధించి ఆయన కొత్త వివాదాన్ని లేవనెత్తారు. ఓ వైపు తాను పార్టీ అధ్యక్షుడిని ఎక్కడా విమర్శించలేదని..తనపై సీఎం, వైసీపీ అధినేత జగన్ కు కోపం కూడా ఉంటుందని తాను అనుకోవటంలేదని రఘురామకృష్ణంరాజు పలుమార్లు ప్రకటించారు.

ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ నేతలు ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. వైసీపీ నేతల కంటే ముందే రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలసి వైసీపీపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు స్పీకర్ ను కలసిన వారిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌ ఉన్నారు. వైసీపీ ఫిర్యాదుపై స్పీకర్ ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాలో మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు వాడిన భాష ఏ మాత్రం సరికాదన్నారు. రఘురామకృష్ణంరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపించారు. స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరించారని తెలిపారు.

Next Story
Share it