Top
Telugu Gateway

కాంగ్రెస్ పై కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పై కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు
X

తొలుత కర్ణాటక. మొన్న మధ్యప్రదేశ్. ఇప్పుడు రాజస్థాన్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వరసగా చేజారిపోతున్నా ఆ పార్టీ అధిష్టానంలో పెద్దగా కదలిక రావటం లేదు. కనీసం ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కూడా కన్పించటంలేదు. ప్రయత్నం చేసి విఫలం అవటం వేరు. అసలు ప్రయత్నం చేయకపోవటం వేరు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కీలక సమయాల్లో స్పందన కరవు అవుతోందనే విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. అంతే కాదు..అధికారంలో ఉండగా ట్రబుల్ షూటర్లు గా కన్పించిన వారంతా ఇప్పుడు ఎందుకూ కొరకాకుండా పోయారా?. ఇది ఆ పార్టీ నేతలను కూడా వేధిస్తున్న ప్రశ్న. ఈ విషయాన్నే ఏ మాత్రం దాచుకోకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. 'కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళన చెందుతున్నాను. కట్టేసిన కొయ్యల నుంచి గుర్రాలు తెంచుకున్న​ తర్వాత మాత్రమే మనం మేల్కొంటామా' అంటూ ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశారు.

రాజస్థాన్ లో పరిస్థితులనుద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేశారు. విచిత్రం ఏమిటంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ కు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే కారణాలతో పోలీసులు నోటీసులు అందించారు. ఈ వ్యవహారంపై సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీ వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రాజస్థాన్ లోని కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడినట్లు అయింది. కపిల్ సిబాల్ ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అందరూ నర్భగర్భలు వ్యాఖ్యలు చేశారు తప్ప...ఎవరూ సంక్షోభానికి కారకులు ఎవరు..పరిష్కారం ఏంటి అనేది ఎవరూ చెప్పటంలేదనే విమర్శలు ఉన్నాయి.

Next Story
Share it