Telugu Gateway
Politics

కెసీఆర్ ప్రకటించిన ‘ఉస్మానియా ఆస్పత్రి టవర్లు’ ఎక్కడ?

కెసీఆర్ ప్రకటించిన ‘ఉస్మానియా ఆస్పత్రి టవర్లు’ ఎక్కడ?
X

సీఎం ప్రకటన చేసి ఐదేళ్లు అయినా అదే పరిస్థితి

కొత్త సచివాలయంపై ఉన్న ఆసక్తి ఉస్మానియా ఆస్పత్రిపై ఏదీ?

ఇప్పుడు కట్టాల్సింది కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనమా?. కొత్త సచివాలయమా?. ఏది అత్యవసరం. ప్రజలకు ఏది అవసరం? పాలకులకు హంగామాతో కూడిన సచివాలయ భవనం అవసరమా?. ప్రజల ప్రాణాలను కాపాడే ఆస్పత్రిని నిర్మించటం అవసరమా?. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి నాళ్లలో 2015లో ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సీఎం కెసీఆర్ అప్పుడు చెప్పిన మాటలు ఏంటో ఒక సారి చూడండి. ‘ఒకప్పుడు ప్రపంచంలోనే పేరుమోసిన ఆస్పత్రి ఇలా తయారు కావటం బాధాకరం. నేను ఎప్పుడో రావాల్సింది. కానీ చాలా లేట్ అయింది. హెల్త్ మినిస్టర్ చాలా సీరియస్ గా చెప్పారు. అందుకే నేను. సీఎస్ కూడా వచ్చాం. ఆస్పత్రి షిఫ్టింగ్ మాత్రం వెంటనే చేయాలి. ఉస్మానియా మెడికల్ కాలేజీ పక్కనే ఉన్న ఆస్పత్రి భవనం స్థానంలో కొత్త భవనం కట్టుకోవాలి. హెరిటేజ్ పేరుతో వందల మందిని పొట్టన పెట్టుకోవటం తెలివి తక్కువ తనం అవుతుంది. ఉండగలిగితే మంచిదే. ఇంత భయానకర పరిస్థితుల్లో ఉంచకూడదు. వెరీ షార్ట్ లీ ఆస్పత్రిని వేరే బిల్డింగ్ లోకి మార్చి కొత్త బిల్డింగ్ కడతాం. నిపుణుల కమిటీ కూడా భవనం మన్నికలేదని తేల్చింది ’ అని ప్రకటించారు.

ఇది 2015లో ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సమయంలో చెప్పిన మాటలు. ఆ తర్వాత కెసీఆర్ పలుమార్లు సమీక్ష జరిపి ఉస్మానియా ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టవర్లు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేసి దాదాపు ఐదేళ్లు కావస్తోంది. కానీ ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ కెసీఆర్ ఆస్పత్రిని సందర్శించిన నాటి కంటే ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారింది. తాజాగా కురిసిన వర్షాలకు కూడా ఆస్పత్రిలోకి నీరు భారీ ఎత్తున చేరుతోంది. దీంతో అక్కడ ఉన్న రోగుల దగ్గర నుంచి డాక్లర్లు, ఇతర సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు.

ఓ వైపు సీఎం కెసీఆర్ మాట్లాడితే తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ చెబుతారు. కానీ గత ఐదేళ్ళలో ఎప్పుడూ అత్యంత కీలకమైన ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. కానీ సచివాలయం భవనాలను పడగొట్టడం దగ్గర నుంచి కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పెట్టిన ఫోకస్ ఉస్మానియాపై మాత్రం పెట్టలేదనే నిస్సంకోచంగా చెప్పొచ్చు. నిత్యం వేలాది మంది వచ్చే ఆస్పత్రి విషయంలో ఐదేళ్లు అయినా కూడా కెసీఆర్ తాను చెప్పిన మాటను తానే పట్టించుకోకపోవటం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితులకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. బుధవారం నాటి నీళ్ల ప్రవాహం అయితే జలపాతాలను తలపించేలా ఉంది.

2015 జులై 23న కెసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిలో చెప్పిన మాటల వీడియో

https://www.youtube.com/watch?v=ipmcPpupv0s

Next Story
Share it