Telugu Gateway
Andhra Pradesh

ఆ ఐదు కోట్ల వెనక అసలు కథ ఏంటి?

ఆ ఐదు కోట్ల వెనక అసలు కథ ఏంటి?
X

కరోనా టైమ్ లో ఒంగోలులో ఐదు కోట్ల బంగారం కొన్నారా?

రెండు లక్షల రూపాయలు మించి నగదు తీసుకోకూడదు కదా?

అంటే అంత భారీ ఎత్తున కొనుగోలుదారులు ఉన్నారా?

ముందు బాలినేని పేరు..తర్వాత అన్నా రాంబాబు

ఇద్దరూ తమకేమీ సంబంధం లేదని ప్రకటన

బంగారు వ్యాపారి మంత్రికి సర్టిఫికెట్ జారీనా?

పట్టుబడ్డ నగదుపై అనుమానాలు ఎన్నో

‘నాలుగు నెలల్లో 5.27 కోట్ల బంగారం అమ్మకం. అది కూడా ఒంగోలులో. ఈ నాలుగు నెలల్లో సగం లాక్ డౌన్ కే పోయింది. అంటే ఇంత తక్కువ సమయంలో ఒంగోలు ప్రజలు ఏకంగా కరోనాను కూడా డోంట్ కేర్ అంటూ అంత విలువ చేసే బంగారం కొన్నారా?. ’ అంటే ఔననే చెబుతున్నారు నల్లమల్లి బాల రామ గిరిష్. తాము 13 సంవత్సరాలుగా హోల్ సేల్ అండ్ బులియన్ వ్యాపారంలో ఉన్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పోనీ నిజంగా హోల్ సేల్ ప్లస్ బులియన్ వ్యాపారం అంటున్నారు కాబట్టి అంత వ్యాపారం జరిగింది నిజమే అనుకుందాం కాసేపు. బంగారం కొనుగోళ్లతో సహా ఏది అయినా సరే రెండు లక్షల రూపాయల కు మించి నగదు లావాదేవీలు చేయకూడదనే నిబంధన ఉంది. మరి అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న ఎన్. బాలరామ గిరీష్ కు ఇంత నగదు దగ్గర పెట్టుకోకూడదు అని తెలియదా?. డీమానిటైజేషన్ తర్వాత నగదు నిర్వహణలో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది.

ఏభై వేల రూపాయల దాటిన కొనుగోలుకు పాన్ కార్డు అందజేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు ఇఛ్చినా సరే రెండు లక్షల రూపాయలు దాటి నగదు లావాదేవీలకు అనుమతించరు. నల్లధనాన్ని నిరోధించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఏ లావాదేవీ అయినా రెండు లక్షల రూపాయల లోపు దాటి నగదులో చేయటానికి అనుమతించరు. పోనీ ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బ్యాంకులు మూసివేశారా అంటే అదీ లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబందనల ప్రకారం సాదారణ వ్యక్తులు అయినా సరే ఇంట్లో రెండు లక్షల రూపాయలకు మించి నగదు ఉంచుకోవటానికి వీల్లేదు. చెన్నయ్ వెళుతుండగా ఓ వాహనాన్ని తమిళనాడు చెక్ పోస్టులో తనిఖీలు చేయగా ఈ భారీ నగదు వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన న్యూస్ 18 ఛానల్ ఏకంగా ఈ కారుకు మంత్రి బాలినేని శ్రీనివాస్ కు చెందిన ఎమ్మెల్యే స్టిక్టర్ ఉందని తెలిపింది. ఈ వ్యవహారంపై కూడా మంత్రి బాలినేని బుదవారం రాత్రే వీడియో, ఆడియో సందేశాల ద్వారా స్పందించి డ్రైవర్లు ఒంగోలుకు చెందిన వారు కావటంతో తన పేరు ప్రచారంలోకి వచ్చిందని..స్టిక్కర్ జిరాక్స్ తీశారని తెలిపారు.

అంతే కాదు..ఈ నగదుతో తనకు ఎలాంటి సంబంధంలేదని..విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు ఛానల్ లో మంత్రి పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని రాగా..గురువారం ఉదయానికి ప్రకాశం జిల్లాకు చెందిన అన్నె రాంబాబు స్టిక్కర్ ఉందనే వార్త వచ్చింది. ఈ స్టిక్కర్ వ్యవహారాన్ని కూడా ఆయన కూడా ఖండించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా సాగుతుండగానే నల్లమల్లి బాలు మీడియాకు ఓ ప్రకటన, దీంతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ‘ ఈ నగదు ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ..ఏ రాజకీయ నాయకుడికి కానీ సంబంధించింది కాదు. దీనికి రాజకీయ రంగులు పులిమి ఎవరిపైనా అపోహలు వేయవద్దని కోరుతున్నా. ఒక నాయకుడు వచ్చి చెబుతున్నాడు ..ఆయనకు ఏమి తెలుసని మంత్రిగారి గురించి మాట్లాడుతున్నాడు. ఎటువంటి మచ్చలేని నాయకుడు. ఎవరు ఎదురు వచ్చినా , ఆపదలో ఉన్నా ఆదుకునే నాయకుడు. అతని గురించి ఈ రోజు కొన్ని పోస్టులు పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వార్తలను పూర్తిగా మీడియా కూడా ఖండించాలి.’ అంటూ ముగించారు. నగదు తనదే అని చెప్పుకోవటం..తమ వ్యాపార లావాదేవీలదే అని చెప్పుకోవటం ఒకెత్తు. అది వదిలేసి ఆయన ఏకంగా మంత్రులకు ‘సర్టిఫికెట్లు’ జారీ చేయటం ద్వారా అనుమానాలు మరింత పెంచేలా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it