‘అమరావతి’పై పవన్ కళ్యాణ్ మౌనవ్రతం!

‘అమరావతి ఎక్కడికి పోదు. ఇది నా హామీ. వెళ్లినా మళ్లీ వస్తుంది. ఈ విషయంలో బిజెపిది..మాది ఒకటే మాట.’ ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పిన మాట. కానీ అత్యంత కీలక సమయంలో మాత్రం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం పాటిస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డీఏ రద్దు బిల్లుల అంశం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదమే తరువాయి. పరిపాలనా వికేంద్రీకరణ ప్రారంభం కానుంది. ఈ అంశంపై ఏపీలో విపక్షాలు అన్నీ స్పందించాయి. ఒక్క జనసేన తప్ప. తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పటికే యనమల రామకృష్ణుడు ఓ లేఖ రాశారు. ఆదివారం నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మరో సుదీర్ఘ లేఖ రాశారు. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు సీపీఐ నేత రామకృష్ణ కూడా స్పందించారు. కానీ ఇంత వరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ అంశంపై స్పందించలేదు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రామకృష్ణలు స్పందించి లేఖలు రాసినందున అమరావతిలో రాజధాని ఉంటుందని కాదు. రాజకీయంగా ఎవరి వాదన వాళ్లు విన్పిస్తున్నారు. చివరి వరకూ మా ప్రయత్నం మే చేశామని చెప్పుకోవటానికి ఇది ఓ అంశంగా వాడుకోవటం తప్ప..పెద్దగా ఫలితం ఉండదనే విషయం లేఖలు రాసిన వాళ్లకూ తెలుసు.
కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ అంశంపై అయినా ఎవరి వాదన వాళ్ళు విన్పించాల్సిందే. వాదన విన్పించాల్సిన సమయంలో ఆ మాట కూడా చెప్పకపోతే ఎటూకాకుండాపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు జనసేన అదే డైలమాలో ఉన్నట్లు కన్పిస్తోంది. ఏపీకి సంబంధించిన అత్యంత కీలకమైన రెండు బిల్లులు ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరాయి. ఆయన సంతకం పెడితే అమరావతి కథ ముగిసినట్లే అవుతుంది. గత అనుభవాలను..ఏపీలో ఉన్న డైనమిక్ రాజకీయాలను పరిశీలించిన గవర్నర్ కూడా ఈ సారి న్యాయనిపుణుల సలహా తీసుకోవటంతోపాటు ఆచితూచి వ్యవహారించే అవకాశం ఉంది. అయితే దీని వల్ల బిల్లులు ఆగిపోతాయని చెప్పటానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు. కాకపోతే ఓ వారం ఆలశ్యం అయితే కావొచ్చు. అంతే కానీ వీటికి బ్రేక్ పడే ఛాన్స్ లు లేనట్లే. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరి రాజకీయం వాళ్లదే. కానీ బిజెపితో కలసి సాగుతున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకూ స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది.