Telugu Gateway
Andhra Pradesh

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ...జగన్ కు తేడా అదే!

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ...జగన్ కు తేడా అదే!
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బుధవారం నాడు సీఎంవోలో చేసిన మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ తరుణంలో చాలా మంది అధికారులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహారశైలిని..జగన్ వ్యవహారశైలిని ప్రస్తావిస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్పుచేశారనే ఆరోపణలు తన వాళ్ళపై వచ్చినా కూడా వాళ్ళను పూర్తిగా రక్షించేందుకు ప్రయత్నించేవారు. అది రాజకీయ నేత అయినా..అధికారి అయినా. ఆయన తీరు అలా ఉండేది. చిన్న చిన్న తప్పుల కారణంగా వాళ్లను దూరం పెట్టడం సరికాదనే వైఖరిలో ఉండేవారు వైఎస్. కానీ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి పూర్తి రివర్స్ అనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఏడాది కాలంలోనే తన మనుషులు అని ప్రచారం జరిగిన వారిపై అత్యంత అవమానకరంగా వేటు వేయటానికి ఆయన ఏ మాత్రం వెనకాడటం లేదు. పోనీ అందుకు ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అంటే అవి కూడా ఏమీలేవని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎన్నికలకు ముందు అప్పటి సీఎస్ అనిల్ చంద్ర పునేఠను తప్పించి..ఎన్నికల సంఘం అనూహ్యంగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్ వి సుబ్రమణ్యాన్ని సీఎస్ గా నియమించింది.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ కూడా సీఎస్ గా ఎల్వీ సుబ్రమణ్యాన్ని కొనసాగించారు. దీనికి కారణం ఎన్నికల సమయంలో ఆయన అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాలకు అడ్డుచెప్పటంతో పాటు నిక్కచ్చిగా వ్యవహరించారనే కారణంతోనే జగన్ సీఎఎస్ గా ఎల్వీ సుబ్రమణ్యాన్ని కొనసాగించారు జగన్. సీఎం అయిన దగ్గర నుంచి జగన్ ఎంతో అప్యాయంగా అన్నా అన్నా అంటూ ఎల్వీ తో ఉన్నారు. కానీ సడన్ గా సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంపై వేటు వేశారు. అందుకు బలమైన కారణాలు కూడా ఏమీలేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయమే చాలా మందిని షాక్ కు గురిచేసింది. ఇప్పుడు అజయ్ కల్లాం వంతు వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు పలు కీలక విషయాల్లో, విధానాల రూపకల్పనలో అజయ్ కల్లాం సహకరించారు. అందుకే ఆయన్ను సీఎం ముఖ్యసలహాదారుగా నియమించటంతోపాటు సీఎంవోలో కీలక శాఖలు అప్పగించారు. తొలి రోజుల్లో అంతా ఆయన కనుసన్నల్లో సాగింది. కానీ సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత కోరితెచ్చుకున్న..కీలక స్థానం అప్పగించిన అజయ్ కల్లాంను సీఎంవో నుంచి తప్పించటం ఐఏఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీ వీ రమేష్ ను తీసుకొచ్చి తొలుత కీలక శాఖలు అప్పగించారు. మధ్యలోనే వాటికి కోత వేశారు. ఇప్పుడు ఏకంగా అన్నీ తీసేశారు. వైఎస్ మాత్రం తప్పు చేసింది తన వాళ్ళు అయినా సరే రక్షించే ప్రయత్నం చేయగా...వైఎస్ జగన్ మాత్రం తాను తెచ్చుకుని..తన మనుషులుగా ముద్రపడిన వారిని కూడా ఏ మాత్రం ఉపేక్షించకుండా...పెద్దగా కారణాలు లేకుండా వేటు వేయటం అన్నది అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సమీక్షలు..సమావేశాల్లో సీఎం జగన్ చెప్పిన దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే అది జగన్ కు నచ్చటం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే అప్పుడు ఎల్వీ సుబ్రమణ్యంపైన అయినా..ఇప్పుడు అజయ్ కల్లాంపైనా వేటు పడిందని చెబుతున్నారు. అదే సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ అందరి కంటే భిన్నంగా సీఎం ఏది చెపితే అది అయిపోవాలనే వైఖరితో ఉండటంతో జగన్ కు, ప్రవీణ్ ప్రకాష్ కు మధ్య వేవ్ లైంగ్త్ బాగా కుదిరిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

అయితే మెజారిటీ ఉన్న ప్రభుత్వంగా ఏ విధాన నిర్ణయం తీసుకోవటానికి అయినా ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి హక్కు ఉన్నా అది కూడా నిబంధనలకు లోబడి ఉండాల్సిందేని..అలా కాకుండా చేయాలంటే సమస్యలు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయం రంగులతోపాటు ఎన్నో విషయాల్లో కోర్టుల ద్వారా అక్షింతలు వేయించుకోవటానికి ప్రధాన కారణం అదేనని చెబుతున్నారు. వైసీపీకి 151 కాదు కదా 175లో ..170 అసెంబ్లీ సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది అమల్లో ఉన్న రాజ్యాంగం, బిజినెస్ రూల్స్ కు లోబడే ఉండాల్సిందేనని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అంతేకానీ మెజారిటీ ఉంది కాబట్టి మా ఇష్టం అంటే న్యాయస్థానాల ముందు నిలబడదు అని అన్నారు. తాజా పరిణామాలతో రాబోయే రోజుల్లో ఎన్ని కోత్త మార్పులు వస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it