Telugu Gateway
Politics

చరిత్ర గతిలోకి చారిత్రక సచివాలయం..కూల్చివేత ప్రారంభం

చరిత్ర గతిలోకి చారిత్రక సచివాలయం..కూల్చివేత ప్రారంభం
X

హుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న చారిత్రక సచివాలయం చరిత్రగతిలోకి కలసిపోతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ సచివాలయం కూల్చివేత ప్రారంభం అయింది. మూడు రోజుల వ్యవధిలోనే ఇది పూర్తి అయ్యే అవకాశం ఉందని అంచనా. హైదరాబాద్ లోని సచివాలయం కూల్చివేత ప్రారంభం కావటంతో అటువైపు వెళ్లే ప్రధాన రహదారులు అన్నీ మూసివేశారు. కొత్తవి..పాతవి అన్న తేడా లేకుండా నిజాం హయాంలో కట్టిన బ్లాక్ దగ్గర నుంచి అన్నీ నేలమట్టం కాబోతున్నాయి. నిజాం నవాబు ల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు అందరూ ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రస్తుత సచివాలయం ప్రాభవం కోల్పోవటం ప్రారంభం అయింది. సీఎం కెసీఆర్ తన తొలి నాలుగున్నర సంవత్సరాల పాలన కాలంలో పదుల సంఖ్యలోనే సచివాలయంలోకి అడుగుపెట్టారు.

స్వయంగా ఆయన ఓ సారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషాలు ఉన్నాయని వ్యాఖ్యానించి కలకలం రేపారు. తర్వాత ఫైర్ సేఫ్టీ లేదని..పార్కింగ్ సదుపాయాలు..సమావేశమందిరాలు లేవంటూ అసలు ఇది పరిపాలనకు పనికిరాదనే తరహాలో ప్రచారం చేశారు. అధికారంలోఉన్న వారు కోరుకుందే జరిగింది. హైకోర్టు కూడా సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సర్కారు రంగంలోకి దిగి కూల్చివేత పనులకు పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో 16 మంది ముఖ్యమంత్రుల పాలన సాగించారు. అతిపురాతన మైన జి బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మాణం జరిగింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న సచివాలయం ఇక కన్పించదు. ఇదే ప్లేస్ లో కొత్త సచివాలయం రానుంది.

Next Story
Share it