Telugu Gateway
Andhra Pradesh

మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోంది?

మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోంది?
X

ఏపీలో మద్యం ఊరూరా ఏరులే పారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. కురిచేడు మరణాలపై ఆయన స్పందించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘కురిచేడులో చనిపోయినవారు పేద కుటుంబాలవారే ఉన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలి. ఆసుపత్రిలో చేరినవారికి మెరుగైన వైద్య సహాయం ఇవ్వాలి. నాటు సారాను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.

ఈ విషయంలో నిర్లిప్తతకు తోడు మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయం మరో గంటసేపు పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్య నిషేధంపై చిత్తశుద్ధి లేదని అర్థం అవుతోంది. నాటు సారా సరఫరా పెరుగుతున్నా, మద్యం దుకాణాల ముందు బారులు తీరి జనాలు ఉంటున్నా మద్య విమోచన కమిటీ స్పందించడం లేదు. ప్రభుత్వ డి-ఎడిక్షన్ కేంద్రాలు కూడా పని చేయడం లేదని సమాచారం ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక డి-ఎడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవి సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలి.’ అని ఓ ప్రకటనలో కోరారు.

Next Story
Share it