Telugu Gateway
Politics

అప్పులు కాదు..అదాయం పెంచే మార్గాలు వెతకాలి

అప్పులు కాదు..అదాయం పెంచే మార్గాలు వెతకాలి
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం కోసం భవిష్యత్ తరాల జీవితాన్ని పణంగా పెడుతున్నారు. అప్పులు తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంటే దీన్ని అభివృద్ధి అనం. తిరోగమనం అనొచ్చు కచ్చితంగా. ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది. వైసీపీ నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి వైపు వెళ్ళాలి.’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు వెళ్ళడం ఎప్పుడూ జరగలేదని, ఈ పరిస్థితి వచ్చింది అంటే.. రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు ఆయన బలైపోతున్నారని అన్నారు. కోర్టుల్లో నిత్యం సర్కారుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయంటే తాము చేసే పనుల్లో తప్పులు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వైసీపీ తమకున్న బలాన్ని రాజకీయ కక్షలు తీర్చుకోవటానికి కాకుండా ప్రజలకు మేలు చేసేందుకు ఉపయోగించాలన్నారు. మొదటి నుంచి భారత దేశంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేయలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా పని చేస్తాయో అలాంటి బలమైన విధానాలు తీసుకురావడంలో దశాబ్దాలుగా మనం విఫలమయ్యాం. తెలంగాణలో వచ్చిన టిఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రభుత్వాలకు వైద్య వ్యవస్థను ప్రక్షాళణ చేసే బలమైన సమయం ఇది.

అలా ప్రక్షాళణ జరగాలని నేను కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై మరింత దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ‘కాపు రిజర్వేషన్ల అంశాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి ఎలాంటి మొహమాటం లేకుండా మేం కాపులకి రిజర్వేషన్లు ఇవ్వం అని చెప్పారు. ప్రజలు ఆయన్ని ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కూడా మరోసారి అదే మాట - కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు అని చెబితే అందరికీ స్పష్టత వస్తుంది. వైసీపీ ప్రభుత్వంగానీ, ప్రజా ప్రతినిధులుగానీ ఎన్నికల్లో ఇవ్వం అని చెప్పాం కాబట్టి ఇవ్వడం లేదు అని ఇంకోసారి స్పష్టం చేస్తే బాగుంటుంది. అలాగే కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ఫండ్స్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it