మళ్ళీ ఎస్ఈసీగా నియమించండి

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాడు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పును అనుసరించి తనను తిరిగి ఎస్ఈసీ పోస్టులో నియమించాలని వినతిపత్రం అందజేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తనను ఈ పోస్టులో నియమించలేదనే విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన గవర్నర్ కు ఓ వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం తీసుకున్న గవర్నర్ తన విజ్ణాపనపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. తన వినతిని గవర్నర్ ఎంతో ఓపిగ్గా విన్నారని..అదే సమయంలో సానుకూలంగా స్పందించారని గవర్నర్ తో భేటీ అనంతరం రమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ జోక్యంతో ఈ అంశంలో తనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎస్ఈసీ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించటంతోనే రమేష్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇది ఒక రకంగా గవర్నర్ కు ఇరకాట పరిస్థితి. అంతే కాదు ఇప్పుడు రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ అంశంలో నియామక అధికారం కలిగిన ఉన్న గవర్నర్ ను కలవాలని సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గవర్నర్ ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు అన్నది కీలకంగా మారింది. ఇదిలా ఉంటే రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటీషన్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కారు మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కింది.