Telugu Gateway
Andhra Pradesh

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లైన్ క్లియర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లైన్  క్లియర్
X

ఏపీ సర్కారుకు గవర్నర్ ఆదేశం

కీలక పరిణామం. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సంబంధించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు . మే 29 నాటి హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు. అదే లేఖను ఎస్ఈ సీ రమేష్ కుమార్ కు కూడా చేరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనను తిరిగి ఎస్ ఈసీగా నియమించాలని కోరుతూ రమేష్ కుమార్ సోమవారం నాడు గవర్నర్ కు వినతిపత్రం అందజేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు స్టే లభించకపోయినా ఎందుకు తమ ఆదేశాలను అమలు చేయలేదని హైకోర్టు ఇటీవల ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత కొన్ని నెలలుగా ఏపీలో రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేస్తూ ఎస్ఈసీగా రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయమే ఈ వివాదానికి కారణం అయింది.

ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి ఆయనా?. నేనా?. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వానికి అసలు సమాచారం ఇవ్వకుండా ఎలా ఎన్నికలు వాయిదా వేస్తారు. చంద్రబాబుది, రమేష్ కుమార్ ది ఒకే సామాజిక వర్గం. ఎన్నికల్లో ఆ పార్టీకి మేలు చేసేందుకు ఎన్నికలను వాయిదా వేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల సంస్కరణలు అంటూ సర్కారు ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రమేష్ కుమార్ పదవి పోయేలా చేశారు. అయితే ఈ ఆర్డినెన్స్ ను రమేష్ కుమార్ హైకోర్టులో ఛాలెంజ్ చేయటం..తర్వాత ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించటం..అక్కడా సర్కారుకు ఊరట లభించకపోవటం తెలిసిన విషయాలే. చివరకు రమేష్ కుమార్ తిరిగి ఎస్ఈసీ పోస్టులో కూర్చోవటానికి రంగం సిద్ధం అయింది.

Next Story
Share it