Telugu Gateway
Andhra Pradesh

రాజధానిని మూడు ముక్కలు..అభివృద్ధి వికేంద్రీకరణ కాదు

రాజధానిని మూడు ముక్కలు..అభివృద్ధి వికేంద్రీకరణ కాదు
X

రాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాల భూమి ఇఛ్చిన రైతులతో సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తమ పాలన వచ్చింది కాబట్టి కాబట్టి రాజధాని మార్చుకుంటామని ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం సరికాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. బిజెపితో కలసి ఈ విషయంలో ముందుకు సాగుతామని తెలిపారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదు. ఏ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఏయే రంగాలను ఏ జిల్లాల్లో అభివృద్ధి చేస్తారు? అక్కడ ఏర్పాటు చేసే అభివృద్ధి ప్రాజెక్టులు ఏమిటి అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.’ అని సూచించారు. రాజధానిని పరిరక్షించుకొనేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ 29వేల మంది రైతుల త్యాగాలను వృథా కానీయమని తెలిపారు.

‘ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అంతే తప్ప గత ప్రభుత్వం వేరు మా ప్రభుత్వం వేరు అనడం ప్రజాస్వామ్య విధానం కాదు. రైతులు తమ భూములను ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప... ఒక వ్యక్తికో, పార్టీకో కాదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించడం ఎంత మాత్రం భావ్యం కాదు. గత ఏడాది కూడా రైతులు నిరసనలు చేపడితే తప్ప కౌలు చెల్లింపులకు నిధులు విడుదల చేయలేదు. ఈ దఫా కూడా అదే పరిస్థితి. కౌలు చెల్లింపులకు జీవో ఇచ్చారు తప్ప రైతులకు ఇప్పటి వరకూ ఆ మొత్తాలు చేరలేదు. ఏప్రిల్ మాసంలో అందాల్సిన కౌలు ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం రైతులను వేదనకు గురి చేయడమే.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it