గత ఏడాది బ్యాంకు మోసాల కేసులు 84,545

ఈ మోసాల విలువ 1.85 లక్షల కోట్లు
మోసం చేయటం తమ హక్కుగా భావిస్తున్నారు కొంత మంది బ్యాంకు అధికారులు, ఉద్యోగులు. అందుకే మోసాల్లోనూ వారి వాటాను వారు కొనసాగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త కోరితే ఇఛ్చిన వివరాలు చాలా ఆసక్తికరంగా..షాకింగ్ గా ఉన్నాయి. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో నమోదు అయిన బ్యాంకు మోసాల కేసులు ఏకంగా 84,545 ఉన్నాయి. ఈ మోసాల విలువ 1.85 లక్షల కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులతో పాటు కొన్ని ఆర్ధిక సంస్థల్లో చోటుచేసుకున్నవే.
ఇందులో బ్యాంకు సిబ్బంది పాల్పడిన మోసాల కేసులు 2668 అయితే..వీటి విలువ 1783. 22 కోట్ల రూపాయలు. బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ లకు గత ఆర్ధిక సంవత్సరంలో అందిన ఫిర్యాదులు 2,14,480 గా ఉన్నాయి. ఇందులో అత్యధిక ఫిర్యాదులు అందింది దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్ బిఐపై. ఈ బ్యాంకుపై 63,259 ఫిర్యాదులు రాగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పై 18,764 ఫిర్యాదులు, ఐసీఐసీఐ బ్యాంకుపై 14,582 ఫిర్యాదులు అందాయి.