Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో బిజెపి బలపడటం జరిగే పనేనా?!

ఏపీలో బిజెపి బలపడటం జరిగే పనేనా?!
X

‘ఏపీలో బిజెపిని బలోపేతం చేయటమే నా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో బిజెపి-జనసేనల ఉమ్మడి అభ్యర్ధే ముఖ్యమంత్రి. జనసేనతో కలసి అధికారం దిశగా ముందుకెళతాం’. ఇవీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్న మాటలు ఇవి. లక్ష్యం పెట్టుకోవటం..అందుకు అనుగుణంగా పనిచేయటం తప్పేమీ కాదు. కానీ అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి?. ఏపీలో అసలు బిజెపి బలపడటానికి అవకాశం ఉందా?. అన్న అంశాలు పరిశీలిస్తే ప్రస్తుతానికి అయితే అవి ఏ కోశానా కన్పించటం లేదు. ఎందుకంటే అత్యంత కీలకమైన అంశాల్లో కేంద్రంలో గత ఆరేళ్ళుగా అధికారం చలాయిస్తున్న బిజెపి ఏపీకి చేసిందేమీ లేకపోగా..పెద్ద హ్యాండ్ ఇచ్చింది. అందులో కీలకమైనది ‘ప్రత్యేక హోదా’. ప్రతిపక్షంలో ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో పోరాటం చేసిన పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసింది. ఇప్పుడున్న దశలో ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చేసింది. ప్రత్యేక హోదా విషయం ఒకటి అయితే..మరోకటి ఏపీకి అత్యంత కీలకమైన రాజధాని విషయంలోనూ బిజెపి అలాగే దాగుడుమూతలు ఆడుతోంది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులు కల్పించింది.

ఇప్పుడు అధికార వైసీపీ మూడు రాజధానులు అంటుంటే మాత్రం తాము ఇందులో జోక్యం చేసుకోబోమని సోము వీర్రాజు కుండబద్దలు కొడుతున్నట్లు చెబుతున్నారు. తాము అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరతామని..రైతుల తరపున ఉంటామని చెబుతున్నారు కానీ..అమరావతిలో రాజధాని ఉండాలనే విషయంలో మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. పోనీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైసీపీ ఖరారు చేసిన వైజాగ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుందా? అంటే అదీ లేదు. మరి ఏపీ ప్రజలు ఏ విషయంలో బిజెపి కి అండగా నిలబడతారు. విభజన హామీల్లో ఉన్న కడప స్టీల్, మేజర్ పోర్టు వంటి హామీలను కూడా తుంగలో తొక్కేసింది. రైల్వే జోన్ విషయంలో కూడా ఏపీ పార్టీలు కోరుకున్నది ఒకటి..కానీ కేంద్రం చేసింది మరొకటి. పోలవరం ప్రాజెక్టు అంటారా?. అది కూడా విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా ఉంది. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు బిజెపి చేసిన చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏమి ఉన్నాయని ఆ పార్టీ ఏపీలో అధికారం సాధించే దిశగా దూసుకుపోవటానికి. మరి బిజెపి ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it